Uttarakhand Rescue Operation Updates:
హైదరాబాద్ నుంచి మెషీన్..
ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Rescue Operation) ఇంకా కొనసాగుతోంది. ఇందుకోసం విదేశాల నుంచి నిపుణులతో పాటు అమెరికా నుంచి Augur Machine తెప్పించారు. కానీ ఆ మెషీన్ డ్రిల్లింగ్ చేస్తుండగానే విరిగిపోయింది. సొరంగంలోనే ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీసుకురావడమూ పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ మెషీన్‌ని కట్ చేసేందుకు ఓ మెషీన్ అవసరమైంది. ఈ యంత్రాన్ని హైదరాబాద్ నుంచే తరలించారు. ప్లాస్మా కట్టర్ మెషీన్ (Plasma Cutter Machine)ని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించారు. ఓ ఛార్టర్ ఫ్లైట్‌లో ఏపీలోని రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి డెహ్రడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌కి తరలించారు. అక్కడి నుంచే నేరుగా సిల్‌క్యారా సొరంగం వద్దకు తీసుకెళ్లారు. మైక్రో టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ క్రిస్ కూపర్ (Chris Cooper) ఈ ఆపరేషన్‌ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్లాస్మా కట్టర్ మెషీన్‌తో ఆగర్ మెషీన్ స్టీల్‌ని కట్ చేయనున్నారు. మరో 16 మీటర్ల మేర కట్ చేస్తే తప్ప ఆ మెషీన్‌ని పూర్తిగా సొరంగంలో నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం లేదని వెల్లడించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఈ ఆపరేషన్‌పై స్పందించారు. త్వరలోనే ఆగర్ మెషీన్‌ని బయటకు తీసుకొస్తామని వెల్లడించారు. ఆ తరవాతే మాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుందని వివరించారు. ప్లాస్మా మెషీన్ స్టీల్‌ని చాలా తొందరగా కట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
"హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ మెషీన్‌ని తెప్పించాం. ఉదయం నుంచి అది పని చేస్తూనే ఉంది. చాలా వేగంగా ఈ పని కొనసాగుతోంది. 14 మీటర్ల మేర ఇంకా కట్ చేయాల్సి ఉంది. ఆగర్ మెషీన్‌ని కట్ చేసి బయటకు తొలగించాల్సి ఉంటుంది. త్వరలోనే ఇది పూర్తవుతుంది. ఆ తరవాత మాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుంది"
- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
సాంకేతికతంగా రెస్క్యూ ఆపరేషన్‌కి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదే ఆలస్యానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఆగర్ మెషీన్ విరిగిపోవడం పెద్ద సమస్యగా మారింది. National Disaster Management Authority (NDMA) ప్రకారం...గత 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌లో ఏ కదలికా లేదు.