Uttarakhand Rains:
కేదార్‌నాథ్ యాత్రకు ఆటంకం..
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఫలితంగా కేదార్‌నాథ్ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. రుద్రప్రయాగ్‌లో భారీ కొండ చరియలు విరిగి పడడం వల్ల దాదాపు మూడు షాప్‌లు ధ్వంసమయ్యాయి. 10 మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతానికి NDRF సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఎవరినీ బయటకు తీసుకురాలేకపోయారు.
దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరం అని ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
"రుద్రప్రయాగ్‌లోని గౌరికుండ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో పాటు జిల్లా యంత్రాంగమూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులకు అండగా ఉంటుంది"
- పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
గల్లంతు..
ఈ ఘటన తరవాత సీఎం పుష్కర్ సింగ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌ని సందర్శించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అర్ధరాత్రి పూట ఉన్నట్టుండి కొండ చరియలు విరిగి పడ్డాయని ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్లంతా చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం వీళ్ల కోసం అన్ని చోట్లా గాలిస్తున్నారు. అంత వర్షంలోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.