Uttarkashi Helicopter Crash News Today: ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలడంతో విషాదం నెలకొంది. ఉత్తరకాశీ జిల్లాలో గంగననికి సమీపంలో ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 5 మంది మృతిచెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరకాశీ జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రయాణికులతో డెహ్రాడూన్ నుంచి హర్షిల్ హెలిప్యాడ్‌కు బయలుదేరిన విమానం గంగాననికి సమీపంలో కూలిపోయింది.. గంగననికి సమీపంలోని నాగ మందిరం దగ్గర్లో భాగీరథి నదికి అతి సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని సమాచారం.
ఉత్తరకాశీలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. మృతులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను సీఎం పుష్కర్ సింగ్ దామి ఆదేశాలు జారీ చేశారు. అధికారులను అడిగి ఘటన వివరాలు ఆరా తీశారు. పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించినట్లు తెలుపుతూ పోస్ట్ చేశారు.
ఘటనా స్థలానికి SDRF, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం, అంబులెన్స్ చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రైవేట్ కంపెనీదని.. అందులో కొందరు ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ క్రాష్ అయింది. గాయపడిన చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.