Uttarakhand Exit Poll Live: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ABP- C Voter సంయుక్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. ఈ పోల్స్ ప్రకారం ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్-భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
యువ సీఎం పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో భాజపా బరిలోకి దిగింది. మరోవైపు కాంగ్రెస్.. తమ సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పైనే నమ్మకం పెట్టుకుంది. ఆమ్‌ఆద్మీ కూడా ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి.
హోరాహోరీ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 26- 32 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 32-38 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీ 0-2 స్థానాలు గెలవొచ్చు. ఇతరులకు 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఓటింగ్ శాతం
ఓటింగ్ శాతం గురించి చూస్తే భాజపాకు 40.8, కాంగ్రెస్‌కు 39.3 శాతం ఓట్లు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 8.7, ఇతరులకు 11.2 శాతం ఓట్లు రాబట్టుకునే అవకాశం ఉంది.
సీట్లు పరంగా చూస్తే ఎక్కువ కాంగ్రెస్‌కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఓట్ల పరంగా భాజపాకు ఎక్కువగా పోలైనట్లు కనిపిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి భాజపా, కాంగ్రెస్ మధ్య అధికారం దోబూచులాడుతోంది. మరి ఫిబ్రవరి 14న జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించనుందో మార్చి 10న తెలియనుంది. ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు ఒక విడతలోనే జరిగాయి.