Chamoli Cloud Burst: శుక్రవారం రాత్రి ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని థరాలిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వరద ప్రవాహానికి ఆ ప్రాంతమంతా కకావికలమైంది. ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి తర్వాత వరద ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. అనేక వాహనాలు నీట మునిగిపోయాయి, దుకాణాలు దెబ్బతిన్నాయి ఇళ్ళు మునిగిపోయాయి.
జిల్లా యంత్రాంగం ప్రకారం...థరాలిని సగ్వారా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి కురిసి వర్షానికి ఊళ్లు ఏరులు ఏకమైపోయాయి. ఇలా వచ్చిన వర్షానికి చెపాడాన్ మార్కెట్, కోట్‌దీప్ మార్కెట్ నీట మునిగాయి. రెండు మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు చేరిపోయాయి.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సగ్వారా గ్రామంలో పూర్తిగా ధ్వంసమైంది. దుకాణాలు దెబ్బతిన్నాయి. నీటిలో చిక్కుకున్న వారిని రాత్రివేళలో బయటకు తీశారు. వరద బీభత్సం గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రక్షణ దళాలు స్పాట్‌కు చేరుకున్నాయి. పోలీసులు డీడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.
వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను క్లియర్ చేస్తున్నారు. చాలా ప్రాంతాలతో రాకపోకలు తెగిపోయాయి. థరాలి–సాగ్వారా , థరాలి–గ్వాల్డామ్ రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునరుద్ధించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
జరిగిన దుర్ఘటనలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి స్పందించారు. " లేట్ నైట్‌లో చమోలి జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్‌తో విషాదం చోటు చేసుకుంది. జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకు కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. అధికారులతో నిరంతరం నేరుగా సమీక్ష చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను " అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇవాళ కూడా ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చమోలి ప్రాంతానికి వరద ముప్పు వీడలేదని అంటున్నారు. డెహ్రడూన్, తెహ్లీ, బాగేశ్వర్, నైనిటాల్‌లో కుండపోత ఖాయమంటూ అధికాలులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే మూడు రోజులు ఇలాంటి వాతావరణం ఉంటుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.