Uttarakhand Assembly Passes Uniform Civil Code Bill : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(యూసీసీ)ను తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై దేశంలోని అనేక వర్గాలు నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. యూసీసీ అమలు చేస్తామని కేంద్రం చెప్పినప్పటికీ పలు వర్గాలు నుంచి వచ్చిన వ్యతిరేకతతో కేంద్రం నెమ్మదించింది. ఈ బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబీ ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. భవిష్యత్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ తరహా బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రకటన చేసింది.


ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. బిల్లును పుష్కరసింగ్‌ ధామీ సభలో ప్రవేశపెట్టారు. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లులో వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన అంశాలతోపాటు సహ జీవనానికి రిజిస్ర్టేషన్‌ వంటి అంశాలను పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించాలని విపక్షాలు సూచించినా అధికార పార్టీ మాత్రం పట్టించుకోకుండా పంతం నెగ్గించుకుంది. ఒకసారి గవర్నర్‌ ఆమోదం లభిస్తే అది చట్టంగా మారనుంది. స్వాంత్రం తరువాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవబోతోంది. పోర్చుగ్రీస్‌ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. తాజాగా తీసుకురానున్న ఉమ్మడి పౌరస్మృతితో ఉత్తరాఖండ్‌లో వివాహాం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబందనలు వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకువచ్చారు. 


చరిత్రలో మర్చిపోలేని రోజన్న సీఎం


బిల్లు ఆమోదం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ.. ఉత్తరాఖండ్‌ చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజంటూ పేర్కొన్నారు. యూసీసీ అమలుకు దేశ వ్యాప్తంగా ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయని, అలాంటి బిల్లును తొలుత ఉత్తరాఖండ్‌ తీసుకువచ్చిందన్నారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా తీసుకువచ్చింది కాదన్నారు. దీనివల్ల మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. వివాహం, విడాకులు వంటి విషయాల్లో మహిళలపై ఉన్న వివక్షను ఈ బిల్లు తొలగిస్తుందని సీఎం స్పష్టం చేశారు.