యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm, ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay) డిజిటల్ పేమెంట్ యాప్‌లు పనిచేయడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యూపీఐ చెల్లింపులలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
యూపీఐ చెల్లింపులకు తికమక..
మధ్యాహ్నం 12 గంటల సమయానికి సమస్య మరింత పెరిగింది. ఆ సమయంలో ఏకంగా 1200 మంది యూపీఐ చెల్లింపులపై రిపోర్ట్ చేశారు. 66 శాతం యూజర్లకు పేమెంట్ చేసే సమయంలో సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. మరో 34 శాతం మంది యూజర్లకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ కావడం లేదని రిపోర్ట్ చేశారు. ఇటీవల మార్చి నెలాఖరులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న యూపీఐ వినియోగదారుల టెక్నికల్ ప్రాబ్లమ్ తో పేమెంట్స్ చేయలేకపోయారని తెలిసిందే.
షాపింగ్ మాల్స్, బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా ఏదైనా సరే.. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. వీకెండ్ కదా అని షాపింగ్ కు వెళ్లి పేమెంట్స్ అవ్వక, ఇటు జేబులో నగదు లేక ఇబ్బందులు పడుతున్నట్లు యూపీఐ యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు.
UPI అంటే ఏమిటి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణలో పనిచేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన తక్షణ చెల్లింపు వ్యవస్థను యూపీఐగా చెప్పవచ్చు. దీని ద్వారా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా మొబైల్ నెంబర్‌కు, బ్యాంకు ఖాతాలకు క్షణాల్లో నగదు బదిలీ చేయవచ్చు. షాపింగ్ మాల్స్, చిన్న షాపులలో, ఎలాంటి కొనుగోళ్లు చేయాలన్నా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
అయితే యూపీఐ ఎందుకు డౌన్ అయిందనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. NPCI నుంచి, యూపీఐ ప్లాట్‌ఫాంల నుంచి అధికారిక ప్రకటన కూడా రాలేదు. దాంతో నగదు చెల్లింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్ బదులు నగదు ప్రత్యామ్నాయ చెల్లింపులకు నగదు అందుబాటులో ఉంచుకోవాలని వినియోగదారులకు సూచించారు.