UP News: మ‌న దేశంలో ఎవ‌రికైనా అన్యాయం జ‌రిగితే ఆశ్ర‌యించేందుకు న్యాయ‌స్థానాలు ఉన్నాయి. ఆల‌స్య‌మైనా బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. మ‌నుషుల‌తో పాటు మూగ ప్రాణుల కోసం కోర్టులో కేసులు దాఖ‌లైన ఘ‌ట‌న‌లు కూడా మ‌న‌కు తెలుసు. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఎలుకను ‘దారుణంగా చంపినందుకు’ ఓ యువకునిపై పోలీసులు 30 పేజీల చార్జిషీట్ ఫైల్ చేశారు. 


బాదౌన్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి గ‌తేడాది న‌వంబ‌ర్ 25న కొత్వాలి ప్రాంతంలో ఓ ఎలుక తోకకు రాయి కట్టి దాన్ని ఓ కాలువలో ముంచి చంపాడు. ఆ ఘ‌ట‌న‌ను జంతు హక్కుల పరిరక్షణ సంఘం స‌భ్యుడు వికేంద్ర శర్మ.. వీడియో తీసి మనోజ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి నుంచి ఆ ఎలుకను రక్షించడానికి తాను ప్ర‌యత్నించానని, కానీ అప్పటికే అది ఊపిరాడక చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు 30 పేజీల చార్జిషీట్ రూపొందించి అందులో ఆ ఎలుక పోస్ట్‌మార్టం, సంబంధిత‌ వీడియోలు, వివిధ డిపార్టుమెంట్లకు చెందిన నిపుణుల అభిప్రాయాలను కూడా చేర్చారు.


ఈ కేసులో మ‌నోజ్ కుమార్‌పై జంతు హింస నివారణ చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 429 (ఏదైనా జీవించి ఉన్న జంతువును చంపడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. బెరైలీలోని వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి ఈ ఎలుక మృతదేహాన్ని పంపామని, నీటిలో ముంచినందున ఎలుక ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఉబ్బిపోయాయని, కాలేయంలోనూ ఇన్‌ఫెక్ష‌న్ గుర్తించార‌ని.. ఇలా పలు అంశాలను వారు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు.


ఇలాంటి కేసు తమ దృష్టికి రావడం ఇదే మొదటిసారని వారు తెలిపారు. నిందితుడు మనోజ్ కుమార్ ని కోర్టులో హాజరు పరచగా కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చట్టం కింద.. నిందితుని చర్య నేరం కాదని బాదౌన్ డివిజనల్ అటవీ అధికారి అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతు హింస నివారణ చట్టం కింద మనోజ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదయినందున అతనిపై చర్య తీసుకున్నారని ఆయన చెప్పారు. ఎలుకను చంపడం నేరం కాదని, అయితే జంతు హింస కింద, ఈ కేసులో నిందితుడికి శిక్ష పడుతుందని తెలిపారు. మనోజ్‌పై ఆరోపణలు రుజువైతే రూ.10 నుంచి రూ.2 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, అతనికి రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. 


ఈ కేసులో నిందితుడు మనోజ్ కుమార్‌ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుక, కాకి లాంటి వాటిని చంపడం తప్పు కాద‌ని, ఇవి హానికరమైన జీవులని తెలిపాడు. “మా కుటుంబం తయారు చేసిన పచ్చి కుండలను ఎలుకలు కొరుకుతూ మట్టి కుప్పగా మారుస్తాయి. అందువ‌ల్ల మాకు ఆర్థికంగా న‌ష్టం క‌లుగుతుంది. ఫ‌లితంగా మానసికంగా ఎంతో వేద‌న అనుభ‌విస్తాం.” అని తెలిపాడు. అంతేకాకుండా “ఈ కేసులో నా కుమారుడిని శిక్షిస్తే.. కోడి, మేక, చేపలను చంపే వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎలుకలను చంపే మందు విక్రయిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశాడు.