Advance Elections: 


ముందస్తు లేదు..


కేంద్రం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కసరత్తు చేస్తున్న క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంకేతాలిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ఏమీ లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ గడువు ముగిసిపోయేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సేవ చేస్తారని వెల్లడించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుండటాన్ని కొట్టి పారేశారు. 


"కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ వేసింది. ఆ తరవాత నిపుణులు కూర్చుని చర్చిస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎన్నో దఫాల చర్చల తరవాతే దీనిపై ఓ తుదినిర్ణయానికి వస్తారు. ఈ కమిటీలో ప్రతిపక్షాలకు చెందిన నేతలూ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


ప్రత్యేక సమావేశాలు..


సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. దీని గురించీ ప్రస్తావించిన అనురాగ్ ఠాకూర్...ఎజెండా ఏంటన్నది మాత్రం చెప్పలేదు. చాలా కీలక విషయాలు చర్చకు రానున్నాయని మాత్రం హింట్ ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి త్వరలోనే ఎజెండా ప్రకటిస్తారని చెప్పారు.


సమర్థించుకుంటున్న కేంద్రం..


ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ వేయడాన్ని సమర్థించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇది భారత దేశానికి ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ అని అసో సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. One Nation, One Election కి సంబంధించి బిల్‌ని ప్రవేశపెట్టేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చినట్టూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కేవలం కమిటీ మాత్రమే వేశామని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


"ప్రస్తుతానికి కమిటీ మాత్రమే ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అన్ని అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించిన తరవాతే దీనిపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో మరో రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1967వరకూ లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ విప్లవాత్మక నిర్ణయం అనే భావిస్తున్నాను.


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి


మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌తో ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవచ్చని అన్నారు. 


"ఇది చాలా మంచి ప్రతిపాదన. దేశంలో పదేపదే ఎన్నికలు జరగడం వల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా పలు చోట్ల అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు అంతరాయం కలుగుతోంది. విలువైన వనరులు వృథా అవుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వల్ల డబ్బు వృథా కాకుండా అడ్డుకోవచ్చు"


- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం


Also Read: దేశ ఐక్యతపై దాడి చేస్తున్నారు, జమిలి ఎన్నికలపై రాహుల్ ఫైర్