One Nation One Election: 


రాహుల్ గాంధీ ట్వీట్..


ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ వేయడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేశంలోని సమస్యల్ని తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడతో వస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ట్విటర్ వేదికగా మోదీ సర్కార్‌పై మండి పడ్డారు. ఇది భారత దేశ ఐక్యతపై బీజేపీ చేస్తున్న దాడి అని అన్నారు. ఇప్పటికే అదానీ వ్యవహారంలో మోదీ సర్కార్‌పై విరుచుకు పడుతున్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు One Nation,One Election పైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


"ఇండియా అంటే భారత్..ఇది అన్ని రాష్ట్రాల ఐక్యతకు చిహ్నం. ఇలాంటి దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే దేశ ఐక్యతపై దాడి చేసినట్టే లెక్క"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






8 మంది సభ్యులతో కమిటీ..


ఒకే దేశం, ఒకే ఎన్నికపై కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో సభ్యులుగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది. కానీ...ఆయన మాత్రం ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ఆహ్వానం అందకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే..ఈ కమిటీలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఉన్నారు. వీరితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే ఉన్నారు. మొత్తం 8 మందితో కూడిన ఈ కమిటీ...జమిలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. ఇందులోని సాధ్యాసాధ్యాలపై పరిశోధించనుంది. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంపై చర్చించనున్నారు. 


లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, వెనుకగా 13 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరగవలసి ఉంటుంది. కేంద్రం తీరుతో ఈ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడుతుంది. 'ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు' కోసం చట్టాన్ని తీసుకురావాలంటే శాసన పరిశీలన సంఘం ద్వారా సిఫారసులను పొందవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న  ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు  ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జరగవలసి ఉంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్‌ శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలు డిసెంబర్ లో జరగాల్సి ఉంది. 


Also Read: Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స