Central Government Allotted Z+ Security To Mallikarjun Kharge: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మల్లిఖార్జున ఖర్గే భద్రతపై ఇటీవల అధికారులు ఓ నివేదికను హోంశాఖకు అప్పగించారు. దీనిపై సమీక్షించిన హోంశాఖ.. అనంతరం ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీంతో ఇక నుంచి ఖర్గేకు సీఆర్‌పీఎఫ్ కమాండోలు సెక్యూరిటీగా ఉండనున్నారు.
దేశంలోని ప్రముఖులకు వారికి పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. నిఘా వర్గాలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఏ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయిస్తుంది. ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్ ప్లస్ భద్రతను ప్రముఖులకు హోంశాఖ కల్పిస్తూ ఉంటుంది. అలాగే వారికి కల్పించే భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. అనంతరం ఎక్కువమంది సెక్యూరిటీ కావాలనుకుంటే భద్రతను పెంచుతూ ఉంటారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో ఖర్గేకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. ఖర్గే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఇటీవల ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానిని పరిగణలోకి తీసుకుని సీఆర్పీఎఫ్ కమాండోలతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇండియాలో ఎస్‌పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) బలగాల సెక్యూరిటీ తర్వాత అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థగా జెడ్ ప్లస్ ఉంది. ఈ కేటగిరీలో ఉన్న వారికి 55 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు ఎస్కార్టు ఉంటుంది. దేశంలో ఎక్కడికెళ్లినా వారి వెంట సీఆర్పీఎఫ్ కమాండోలు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ భద్రత ఉంది. అదే తరహాలో ఇప్పుడు ఖర్గేకు కూడా సెక్యూరిటీ ఉండనుంది. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ సెక్యూరిటీ కల్పించారు. కానీ 2019 తర్వాత ఎస్పీజీ నుంచి జెడ్ ప్లస్‌కు మార్చారు. ప్రస్తుతం ప్రధాని మోదీతో పాటు మాజీ ప్రధానులకు ఎస్పీజీ భద్రత కల్పిస్తున్నారు. అలాగే మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేతలకు కూడా ఎస్పీజీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎస్పీజీ సెక్యూరిటీ కలిగి ఉన్నారు.
కాగా వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే దేశంలోని నేతలందరూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. జాతీయ నేతలైతే వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఎన్నికలు వస్తుండటంతో వివిధ పార్టీల్లోని అగ్రనేతల భద్రతపై హోంశాఖ సమీక్షిస్తోంది. ప్రమాదం పొంచి ఉన్న నేతలకు సెక్యూరిటీని పెంచుతున్నారు. మార్చి 10లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఈసీ షెడ్యూల్ ప్రకటనకు సిద్దమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఖర్గేకు జడ్ ప్లస్ కేటగిరీ కల్పించడం చర్చనీయాంశంగా మారింది.