గుండెపోటు... వయస్సుతో సంబంధంలేకుండా అటాక్ చేస్తోంది. ఫిట్‌గా ఉన్న వారు కూడా హార్ట్‌అటాక్‌తో మరణిస్తున్నారు. ఈ క్షణంలో సంతోషంగా ఆడిపాడిన వారు..  ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా.. .కోరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న  వారిలో గుండెపోట్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దీంతో కరోనా వ్యాక్సిన్లకు.. గుండెపోట్లకు సంబంధం ఉందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే... అవి  అనుమానాలు మాత్రమే అని వాస్తవం కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా చేసిన వ్యాఖ్యలు కలవర  పెడుతున్నాయి. 


కోవిడ్‌ రోగులను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేశారు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ. కోవిడ్‌ బారిన పడిన వారు కొంతకాలం కఠినమైన వ్యాయామాలు చేయకపోవడమే  మంచిదన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఇటీవల చేసిన ఓ అధ్యయనాన్ని వివరించారు. దాని ప్రకారం... కరోనా బారిన పడి, తీవ్రమైన  లక్షణాలతో బాధపడి కోలుకున్న వారు వ్యాయామానికి దూరంగా ఉండాలని సూచించారు. కొంతకాలం అంటే.. దాదాపు ఒకటి, రెండు సంవత్సరాల పాటు జాగ్రత్తగా ఉండాలని  సూచించారు. శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించే హార్డవర్క్స్‌ చేయొద్దని.. ఎక్కువగా రన్నింగ్‌ కూడా వద్దని చెప్పారు. శ్రమకు దూరంగా ఉండటమే మేలని చెప్పారు మన్సుఖ్‌  మాండవీయ. శ్రమతో కూడిన వ్యాయామాల జోలికి వెళ్లొద్దన్నారు. దీని వల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి గుండెపోటు మరణాలను నివారించవచ్చని తెలిపారు. 


కరోనా తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువ కావడం... ఆందోళన కలిగించే విషయం. కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ శుక్ల కూడా  గుండెపోటుతోనే మరణించారు. యంగ్‌ హీరోలు హార్ట్‌అటాక్‌తో ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరిచింది. ఆందోళన కలిగించింది. 2022 చివరి నుంచి గుండెపోటు కారణంగా 20  నుంచి 30ఏళ్ల లోపు వారు ఎక్కువగా మరణిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లో గర్బా డ్యాన్స్‌ చూస్తూ 10 మందికిపైగా గుండెపోటుతో మరణించారు. వారంతా టీనేజర్లే.  కపద్వాంజ్‌ ఖేడ్‌ జిల్లాలో గర్భా ఆడుతుండగా 17ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. డోదర జిల్లాలోని 13ఏళ్ల బాలుడు, 28 ఏళ్ల యువకుడు, 55 ఏళ్ల  వ్యక్తి గర్బా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఆ విషయాలను గుర్తుచేస్తూ ఈ సూచనలు చేశారు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ. 


కరోనా ప్రపంచాన్నే తల్లకిందులు చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. మూడేళ్ల పాటు ప్రజలు భయం గుప్పెట్లో బతికేలా చేసింది. కరోనా నుంచి కాస్త ఉపసమనం దొరికింది అనుకునే లోపు.... గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న, పెద్దా తేడా లేకుండా... అందిరికీ హార్ట్‌ అటాక్‌ రావడం కలవర పెడుతోంది. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత... గుండెపోటు మరణాలు పెరగడం అందరినీ ఆలోచింపచేస్తోంది. అందుకే... జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు కేంద్ర మంత్రి. కారణాలు ఏవైనా.. గుండెపోటుతో అకాల మరణాల బారిన పడేకంటే.. అధ్యయనాల్ల ప్రకారం జాగ్రత్తలు పాటించడమే ఉత్తమమని అంటున్నారు. కొంతకాలం కఠినమైన ఎక్సర్‌సైజ్‌లకు దూరంగా ఉంటే పోయేది ఏమీ ఉండదు. ముంచుకొచ్చే అకాల మృత్యువును తప్పించే అవకాశం ఉంటే.. అందరికీ సంతోషమే కదా. కనుక... కఠినమైన జోలికి వెళ్లకండి.. గుండెను పదిలంగా ఉంచుకోండి.