Union Cabinet Meeting Latest News: ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం (మార్చి 7) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది చివరి కేబినెట్ భేటీ కావడంతో వారు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంత్రివర్గ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.


కేంద్ర ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీపికబురు అందించింది. కరవు భత్యం (డీఏ)లో 4 శాతం పెంపుదలకు ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర ఉద్యోగుల భత్యం ఇప్పటి వరకూ ఉన్న 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ప్రభుత్వ ఈ కొత్త నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల అలవెన్సులు భారీగా పెరగనున్నాయి.


ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఇచ్చే సబ్సిడీ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది. ఉజ్వల పథకం కింద ఇచ్చే రూ.300 సబ్సిడీ కాలపరిమితిని మార్చి 31, 2025 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. సబ్సిడీ సిలిండర్ రూ.603కే అందుబాటులో ఉండనుంది. ఇప్పుడు 10 కోట్ల మందికి పైగా మహిళలు ఏడాదిలో 12 సిలిండర్ల పరిమితి వరకు సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ప్రయోజనం పొందాలని నిర్ణయించారు.


ముడి జూట్ కనీస మద్దతు ధరను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాల్‌కు రూ.285 పెంచారు. అదే సమయంలో, AI మిషన్ కింద, 10,372 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశంలో ఇండియా AI మిషన్ ఆమోదించారు.


దేశంలో 10 వేలకు పైగా జీపీయూలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇది స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. AIని ప్రోత్సహించడానికి, టైర్ 2,3 నగరాల్లో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించారు.


నార్త్ ఈస్ట్ కోసం ప్రత్యేక చొరవ చూపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 8 రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉన్నతి 2024 స్కీమ్ (నార్త్ ఈస్ట్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 


ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ కోసం చట్టం


గోవాలో ఎస్టీ కేటగిరీ జనాభా ఆధారంగా, ఎన్నికల సంఘం గోవా శాసనసభలో ఎస్టీ వర్గానికి కూడా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని అందించేలా కొత్త చట్టాన్ని పార్లమెంటులో తీసుకురావాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. జనాభాను దృష్టిలో ఉంచుకుని, ఎస్టీ కేటగిరీకి ఎన్ని సీట్లు రిజర్వు కావాలో నిర్ధారణ చేయనున్నారు.