Union Cabinet Decisions: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2023-24 సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలకు కేంద్ర సర్కారు కనీస మద్దతు ధరలను బుధవారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ వరి క్వింటాల్ కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధరను రూ.2,183 గా నిర్ణయించింది. ఏ గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరకు 163 రూపాయల మేర పెంచింది. ఆ గ్రేడ్ ధరను రూ. 2,203 రూపాయలు ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ.8,558 గా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభదాయకంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కేబినెట్ నిర్ణయాలు ప్రకటిస్తూ 2023-24 లో కనీస మద్దతు ధరలో కేబినెట్ చేసిన అత్యధిక వృద్ధి ఇదేనని తెలిపారు. హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3180, జొన్న(మాల్దండి) రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు(విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ.6377, సోయాబీన్ రూ.4600, పత్తి రూ.6620, పత్తి రూ.7020 చొప్పున ఈ సీజన్ లో ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రకటించింది.
సైబర్ సిటీకీ మెట్రో అనుసంధానం
హుడా సిటీ సెంటర్ నుంచి గురుగ్రామ్ లోని సైబర్ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 28.50 కిలోమీటర్ల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరు అయిన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.5452 కోట్లు.
బీఎస్ఎన్ఎల్‌ను కాపాడేందుకు మెగా ప్యాకేజీ
బీఎస్ఎన్ఎల్ ఉనికి కాపాడేందుకు కేంద్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను కేంద్ర మంత్రివర్గం రూ.89,047 కోట్లతో అతిపెద్ద పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశంలో బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్ వర్క్ విస్తరణ కోసం కేంద్ర సర్కారు రంగ సంస్థ అయిన ఐటీఐకి రూ.3889 కోట్ల విలువైన ముందుస్తు కొనుగోలు ఆర్డర్ ని అందజేసింది.
మణిపూర్, ఒడిశా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం
కేంద్ర కేబినెట్ సమావేశంలో మణిపూర్ హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారికి, ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సహా మంత్రులు అందరూ సంతాపం తెలిపారు.