Uniform Civil Code: 



ప్రధాని మోదీ ప్రకటన..


2024 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీలతో పాటు అన్ని స్థానిక పార్టీలూ ఈ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే రాజకీయ వేడి పెరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. "యూనిఫామ్ సివిల్‌ కోడ్" (Uniform Civil Code)గురించి ఆయన ప్రస్తావించడం రాజకీయాల్ని మరో మలుపు తిప్పింది. ఇదేం కొత్త కాదే..అనుకోవచ్చు. కానీ...ఇన్ని రోజులు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు మాత్రమే UCC గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీని అమలు కోసం ప్రత్యేక కమిటీలు కూడా వేశారు. కానీ...ఇప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యూనిఫామ్ సివిల్ కోడ్‌ని ప్రస్తావించడం వల్ల దీనిపై డిబేట్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. అందరికీ ఒకే చట్టం అనేదే ఈ కోడ్ ఉద్దేశం. ఒకే దేశంలో విభిన్న చట్టాలెందుకు..? అని నేరుగానే ప్రశ్నిస్తున్నారు మోదీ. అంటే...ఈ సారి బీజేపీ తన పొలిటికల్ అస్త్రాన్ని  బయటకు తీసిందన్నమాట. అంతకు ముందు ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమిని అజెండాలో చేర్చి వాటిని నెరవేర్చిన బీజేపీ...ఇప్పుడు యూసీసీపై దృష్టి సారించింది. ఎలాగైనా దీన్ని అమలు చేస్తాం అనే సంకేతాలిస్తూ ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటోంది.
 
ముదిరిన వాగ్వాదం..


చాలా రోజులుగా దీనిపై వాగ్వాదం నడుస్తున్నప్పటికీ...ప్రధాని మోదీ ప్రకటనతో అది మరింత ముదిరింది. ముఖ్యంగా ముస్లిం సంఘాలు దీనిపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తున్నాయి. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బట్టే అది అర్థమవుతోంది. కాంగ్రెస్‌ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది. "ఇది కేవలం ఎన్నికల స్టంట్" అని విమర్శిస్తోంది. "ముస్లింలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బహుశా వాళ్లనెవరో మిస్‌లీడ్ చేస్తుండొచ్చు" ప్రధాని మోదీ పరోక్షంగా కొన్ని సంఘాలపై విమర్శలు చేశారు. కానీ...అటు ముస్లింలు మాత్రం దీన్ని అమలు కానివ్వం అని శపథం చేస్తున్నారు. ఇంతకీ యూసీసీతో వాళ్లకొచ్చే నష్టమేంటి..? అంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...?


ముస్లింల వాదనేంటి..? 


ముస్లిం సంఘాల వాదన ప్రకారం...యూసీసీ మతపరమైన ఆచారాలకు విఘాతం కలిగిస్తుంది. నిజానికి...ముస్లింలు షరియా చట్టాన్ని అనుసరిస్తారు.  Muslim Personal Law Board వీటిని అమలు చేస్తుంది. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంపైనే అసహనం వ్యక్తం చేస్తున్నాయి పలు ముస్లిం సంఘాలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చట్టాలు మారినా...షరియా చట్టంలో మార్పులు తీసుకురావడం అంత సులభం కాదని తేల్చి చెబుతున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌ ఉనికికే ప్రమాదమనీ వాదిస్తున్నాయి. అంటే...నేరుగా ముస్లింల హక్కులని అణిచివేయడమే అవుతుందని తేల్చి చెబుతున్నాయి. షరియా చట్టంలో ముస్లింలకు రక్షణ ఉందని, వాళ్లకోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు ముస్లిం లీడర్లు. అంతే కాదు. యూసీసీ ద్వారా హిందూ సంప్రదాయాలను పాటించాలని...ముస్లింలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అన్ని మతాల వాళ్లు హిందూ ఆచారాలే అనుసరించాలని ఆంక్షలు పెడతారని వాదిస్తున్నారు. 


బీజేపీ అస్త్రం..


బీజేపీ అజెండాలో ఎప్పటి నుంచి యూసీసీ ప్రస్తావన ఉంది. 2014లోనే తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాషాయ పార్టీ. రామ మందిరం, ఆర్టికల్ 370 సమస్యలు పరిష్కరించామని, ఇకపై యూసీసీయే తన లక్ష్యం అని చెప్పకనే చెబుతోంది. గతేడాది డిసెంబర్‌ 9 న ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రాజ్యసభలో  ప్రైవేట్ మెంబర్స్‌ బిల్స్‌లో భాగంగా Uniform Civil Code in India 2020 బిల్ పాస్ అయింది. అయితే...కాంగ్రెస్, టీఎమ్‌సీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటింగ్‌లోనూ పాల్గొనలేదు. 63ఓట్లు అనుకూలంగా, 23 ఓట్లు వ్యతిరేకంగా నమోదయ్యాయి. అప్పటికి ఈ ప్రతిపాదనను పాస్ చేశారు. అప్పటి నుంచి  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అధిష్ఠానం. కాకపోతే మైనార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం వల్ల ఇన్నాళ్లూ ఆగింది. ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గర పడుతుండటం వల్ల స్పీడ్ పెంచింది.