యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పుడే పుట్టిన నవ జాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించబోతోంది. వారికి ఐదేళ్లు వచ్చాక శాశ్వత ఆధార్ నెంబర్, మేజర్లయిన తర్వాత బయోమెట్రిక్ సేకరణ వంటివి చేయనుంది. దీని కోసం రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. దీంతో పాటు వ్యక్తి మరణించిన వెంటనే అతని వివరాలు ఆధార్ పోర్టల్‌లో నమోదయ్యేలా తగిన చర్యలు తీసుకోనుంది. మనిషి పుట్టిన తేదీ దగ్గర నుంచి చనిపోయే తేదీ వరకు వివరాలను సేకరించడం వలన ఆ వ్యక్తి జీవిత కాలం ఎంత అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. 


ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగులైతే పింఛను ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయనేది వారి ఆలోచన. కరోనా లాక్‌డౌన్‌, తర్వాత పరిస్థితుల్లో అనేక మంది చనిపోగా, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు కాలేదు. వారి బ్యాంక్ అకౌంట్లు, రావాల్సిన పింఛన్లు యథావిధిగా వచ్చాయి. అంతేకాక, చనిపోయిన వారి ఆధార్, బ్యాంకు అకౌంట్లు ఆక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డెత్ రిజిస్ట్రేషన్ డేటాబేస్‌తో చనిపోయిన వారి ఆధార్ నెంబర్లను లింక్ చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డేటాబేస్‌లతో లింక్ చేయడం ద్వారా ఇప్పటివరకు ఉన్న లొసుగులను తొలగించడం సాధ్యపడుతుందని భావి్సతున్నారు. 


ఆధార్ కలిగిన వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆధార్‌ను రద్దు చేసే నిబంధనను ఇప్పటి వరకు లేదు.  మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసేటప్పుడు మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ తీసుకునేందుకు.. జనన మరణాల నమోదు చట్టానికి సంబంధించిన ముసాయిదా సవరణలపై  యూఐడీఏఐ  సూచనలు గతంలో కేంద్రాన్ని కోరింది.  మరణించిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్‌ చేసేందుకు.. రిజిస్ట్రార్ల నుంచి ఆధార్ వివరాలను స్వీకరించే విధానాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదు. ఈ విభాగాల మధ్య ఆధార్‌ వివరాలను పంచుకునే ప్రక్రియను ప్రారంభిస్తే.. మరణించిన వారి ఆధార్ నంబర్‌ డీయాక్టివేషన్ కోసం రిజిస్ట్రార్‌లు యూఐడీఏఐను సంప్రదిస్తారు. వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్‌ కార్డును డీయాక్టివేట్ చేయడం లేదా మరణ ధ్రువీకరణ పత్రంతో లింక్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ల దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు.ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.


కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయితే.. ప్రతి ఒక్క వ్యక్తి డాటా పుట్టుక నుంచి మరణం వరకూ అన్నీ రికార్డుల్లో ఉంటాయన్నమాట.