'సనాతన ధర్మం'పై తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ - 2023లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. బీజేపీ విధానాలతో దక్షిణ భారత ప్రాంతీయ పార్టీల తలపై కత్తి వేలాడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధికి ద్రావిడ పాలనా విధానాలే కారణమన్నారు. కేంద్రానికి తమిళనాడు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయికి, తాము ప్రతిఫలంగా 29 పైసలు మాత్రమే అందుకుంటామని అన్నారు. ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని వివరించారు.


కేంద్రం తీరుపై విమర్శలు


కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకునేందుకు కేంద్రం గవర్నర్లను పంపిస్తోందని ఆయన అన్నారు. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఉదయనిధి ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. 


ఆ పార్టీలపై కత్తి


2026 డీలిమిటేషన్ గురించి ఉదయనిధి ఆందోళన వ్యక్తం చేశారు. 1952, 1963లో డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పడ్డాయని అన్నారు. లోక్ సభలో మొత్తం స్థానాల సంఖ్య, ప్రతి రాష్ట్రం కలిగి ఉండే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై ఈ కమిషన్లు సిఫారసు చేశాయని చెప్పారు. ప్రస్తుతం 'దక్షిణ భారత ప్రాంతీయ పార్టీల తలపై కత్తి వేలాడుతోంది.' అని ఉదయనిధి పేర్కొన్నారు. 


ప్రజా ఉద్యమంలో కలిసి వస్తాం


రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న చాలా రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ చర్యను వ్యతిరేకిస్తాయని తాను ఆశిస్తున్నట్లు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మన హక్కులు హరించివేసేందుకు జరుగుతున్న కుట్రను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. ప్రజా ఉద్యమంలో డీఎంకే అగ్రగామిగా ఉంటుందని తాను హామీ ఇస్తున్నట్లు ఉదయనిధి స్పష్టం చేశారు.