భారత దేశంలో రాజకీయాలు లేని సినిమా లేదని సినీ నటి సుహాసిని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో పొలిటికల్ సినిమా తీయడం కష్టమని చెప్పారు. ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. భారతీయ సినిమా రంగంలో రాజకీయాల పాత్రపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. సినిమాల్లో సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మహిళలకు మాత్రమే అసౌకర్యం కలుగుతుందని సుహాసిని పేర్కొన్నారు. 'రోజా', 'దిల్ సే' చిత్రాలను ఉదాహరణగా చూపారు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు మగ నటులు కూడా వెనకాడుతున్నారని చెప్పారు.


కమల్ - మణిరత్నం సినిమా
35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి పని చేయబోతున్నారని సుహాసిని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా చేయొద్దని తాను మణిరత్నంను కోరినట్లు చెప్పారు. తాము తీసిన కొన్ని రాజకీయ, చారిత్రక చిత్రాలు వైఫల్యం చెందడం వల్ల, పొన్నియిన్ సెల్వన్ సినిమా ఆలోచన పని చేస్తుందో లేదో అనే అనుమానం కలిగినట్లు చెప్పారు. అందుకే మణిరత్నాన్ని కోరినట్లు చెప్పారు. అయితే, 'పొన్నియన్ సెల్వన్' కథ మన సంస్కృతిలో ఉందని, తాము దాన్ని రూపొందించక ముందే ప్రజలు దాన్ని ఇష్టపడ్డారని సుహాసిని చెప్పారు. అందుకే ఆ చిత్రం ఘన విజయం సాధించిందని అన్నారు.


తాను మణిరత్నం భార్య కావడం ఫుల్ టైమ్ జాబ్ కంటే ఎక్కువని సుహాసిని సరదాగా అన్నారు. మణిరత్నం భార్య కావడం ఫుల్ టైమ్ జాబ్ కాదా అన్న ప్రశ్నకు సుహాసిని ఇలా స్పందించారు. చాలామంది మహిళలు అన్ని సమయాల్లో ఇలానే పని చేస్తారని అన్నారు. సినిమా చూశాక గూస్ బంప్స్ వస్తే గొప్ప కాదని.. ఎంజాయ్ చేయగలిగితేనే గొప్ప అని అభిప్రాయపడ్డారు. హీరో సగం తిన్న ఐస్‌క్రీమ్‌ని తినమంటే హీరోయిన్ ఎందుకు తినాలని ప్రశ్నించారు. పార్కుల్లో హీరో ఒడిలో కూర్చోమంటే.. ఆ సీన్ నాకొద్దు అని చెప్పానని గుర్తు చేసుకున్నారు. తన తోటి నటీమణులు అందరితో వాట్సప్ గ్రూపు ఉందని, ఆ వాట్సప్ గ్రూపులో రమ్యకృష్ణ అర్ధరాత్రి చాటింగ్ మొదలుపెడుతుందని చెప్పారు.