Iphone 15: ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలకొద్దీ రూపాయలు పెట్టి మరీ ఆపిల్ ఐఫోన్ ను కొనాలని తహతహలాడే వారు చాలా మందే ఉంటారు. చేతిలో యాపిల్ ఐఫోన్ పట్టుకోవడాన్ని ప్రెస్టీజ్ గా ఫీలవుతారు. సంవత్సరానికొకసారి వచ్చే ఐఫోన్ కొత్త మోడళ్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. గంటల తరబడి స్టోర్ ల ముందు నిలబడి కొత్త ఐఫోన్ మోడళ్లను సొంతం చేసుకుంటారు చాలా మంది. ఎంతో ఓపిగ్గా గంటలకొద్దీ నిల్చుంటారు. అలాగే కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 15 కోసం ఢిల్లీలోని ఓ స్టోర్ వద్దకు వెళ్లారు ఇద్దరు వ్యక్తులు.
గుర్గావ్ కు చెందిన రాహుల్, వివేక్ అనే ఇద్దరు సోదరులు తమ ప్రీ-బుక్ చేసిన ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కోసం ఢిల్లీలోని కమలా నగర్ ప్రాంతంలోని ఓ స్టోర్ ముందు క్యూలో నిల్చున్నారు. ఎంతకీ తమ వంతు రాకపోవడంతో సహనం కోల్పోయిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు స్టోర్ లోకి బలవంతంగా ప్రవేశించి అక్కడి సిబ్బందిపై దాడికి దిగారు. ఆవేశంతో వారిపై పిడిగుద్దులు కురిపించారు. దుర్భాషలాడుతూ వారిని కొడుతుండగా.. మిగతా సిబ్బంది ఆ అన్నాదమ్ముళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతి కష్టం మీద వారిని గొడవ పడకుండా ఆపి స్టోర్ నుంచి బయటకు పంపించారు.
స్టోర్ సిబ్బందిపై రాహుల్, వివేక్ దాడి చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐఫోన్ 15 మోడళ్ల కోసం వారిద్దరూ దాడికి పాల్పడటంపై స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సెప్టెంబర్ 22 నుంచి ఐఫోన్ల డెలివరీ
ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు మనదేశంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ఆసక్తి గల వినియోగదారులు యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. దీంతోపాటు ముంబైలోని యాపిల్ బీకేసీ స్టోర్, ఢిల్లీలోని యాపిల్ సాకేత్ స్టోర్ల ముందు కూడా వినియోగదారులు బారులు తీరారు. డెలివరీ యాప్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 15 సిరీస్‌ను కేవలం నిమిషాల్లోనే పొందవచ్చు.
యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో సెప్టెంబర్ 12వ తేదీన ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 ఇతర ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. యాపిల్, బ్లింకిట్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బీందర్ ధిండ్సా అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రకారం ఐఫోన్ 15 మోడల్స్ వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.ఐదు వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది.