తమిళనాడులోని తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్స బోల్తాపడింది. బోల్తాపడిన వ్యాన్ లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది స్పాట్‌లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. 


జవ్వాదిమలై కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇంకా చాలా మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. 


మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 26 మంది ప్రయాణిస్తున్నారు. ఓ వేడుక కోసం సెంబరై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.







ప్రమాదం జరిగిన చోట దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. నీటిబాటిల్స్‌, చెప్పులు, వారి బ్యాగ్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బోల్తా పడిన వ్యాన్‌కు దూరంగా మహిళలు, పిల్లలు పడి ఉన్నారు. అందులో కొందరు కదులుతుండగా మరికొందుర అచేతనంగా పడి ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు స్పాట్‌ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు రిజిస్టర్ చేసి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 






ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల  రూపాయలు, గాయపడిన వాళ్లకు 50వేల రూపాయల చొప్పిన పరిహారం ప్రకటించారు.