Tomato Price Hike: ప్రస్తుతం దేశంలో అత్యంత కాస్ట్‌లీ కూరగాయ ఏదైనా ఉంది అంటే అది టమాటానే. ఇటీవల కొంచెం తగ్గినట్లు ఉన్న టమాటా ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వాలు రాయితీపై టామాటాలు అందించగా కొంతకాలం ప్రజలకు ఉపశమనం దక్కింది. అయితే ఆ తరువాత దేశంలో టమోటా ధరలు మళ్లీ పెరిగాయి.  నెల క్రితం రిటైల్ రేట్లలో టామాటా ధరలు 300 శాతం పెరిగాయి. ప్రభుత్వం కొంత ఉపశమన చర్యలు చేపట్టడంతో గత వారం కిలో ధర దాదాపు రూ.120కి తగ్గగా, మళ్లీ రూ.200 దాటింది.


ప్రస్తుతం ఢిల్లీలో టామాటా ధరలు కిలో రూ.250-260కి పెరిగాయి. ఆగస్టు 2న మదర్ డెయిరీకి చెందిన సఫల్ ఔట్ లెట్లలో కిచెన్ స్టాపుల్ కిలో రూ.259కి విక్రయించారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండిలో టమాటాలు రూ. 150-200కి విక్రయిస్తున్నారు.  


ఆగస్టు 3న వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఢిల్లీలో టమాటా ధర రూ. 213కి పెరిగింది. దేశ రాజధానిలో సగటు టమాటా ధర జూలై 20 నాటికి కిలో రూ.120కి తగ్గింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా టమాటా సగటు ధర రూ.140.1గా ఉండగా, 2వ తేదీ రూ.137.06గా ఉంది. 1న సగటు ధర రూ.132.5 కాగా.. వారం రోజుల క్రితం సగటు ధర కిలో రూ.120గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆగస్టు 2న టమాటా కిలో రూ. 263కు విక్రయించబడింది. ఇది దేశంలోనే అత్యధిక ధరగా రికార్డ్ అయ్యింది. 


ఈ వివరాలు టమాటా ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో వివరిస్తోంది. మరికొన్ని రోజుల్లో కిలో రూ. 300కు చేరుకోవచ్చని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో దిగుబడి, దిగుమతి తగ్గిపోయిందన్నారు.  హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణా కష్టంగా మారిందని ఆజాద్‌పూర్ మండికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి సంజయ్ భగత్ తెలిపారు. కొండ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 


ఉత్పత్తిదారుల నుంచి కూరగాయల ఎగుమతిలో సాధారణం కంటే 6 నుంచి 8 గంటలు ఎక్కువ సమయం పడుతోంది. దీని కారణంగా టమాటా ధర కిలోగ్రాముకు దాదాపు 300కు చేరుకుంటోంది. కూరగాయల నాణ్యత కూడా తగ్గిందని భగత్ చెప్పారు. ఆజాద్‌పూర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (APMC) సభ్యుడు అనిల్ మల్హోత్రా మాట్లాడుతూ.. మార్కెట్‌‌కు టమాటా సరఫరా తగ్గిందని, దీంతో డిమాండ్ పెరిగిందని, వ్యాపారులకు సవాలుగా మారిందన్నారు. కూరగాయల ఎగుమతి ఆలస్యం కారణంగా నాణ్యత క్షీణిస్తోందని, టమాటా, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూరగాయలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. 


వాతావరణ మార్పులతో గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా టమాటా సరఫరాకు అంతరాయం కలిగించాయని మదర్ డెయిరీ ప్రతినిధి వార్తా సంస్థకు తెలిపారు. గత రెండు రోజులుగా పరిస్థితి మరింత దిగజారిందని, ఢిల్లీలోని టమాటాలకు ప్రధాన వనరు అయిన ఆజాద్‌పూర్‌కు రాక గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. పరిమిత సరఫరా టోకు ధరలలో తీవ్ర పెరుగుదలకు కారణమైందని, ఫలితంగా రిటైల్ ధరలను కూడా ప్రభావితం చేసిందని చెప్పారు. 


సరఫరాలో అంతరాయాలు ఇలాగే కొనసాగితే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కౌశిక్ తెలియపారు.  అయితే 10 రోజుల్లో సరఫరా పరిస్థితి మెరుగుపడుతుందని, ఆ తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. టమాట పంట ఎంత త్వరగా చేతికి వస్తే అంత త్వరగా ధరల తగ్గుదల ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కిలో రూ.20 నుంచి 40 మధ్య వచ్చే అవకాశం ఇప్పుడే లేదన్నారు.