పప్పు నుంచి ములక్కాయ వరకు ఎందులో చూసినా టమాటా ఉండాల్సిందే. కూరలో ఎన్ని వేసిన టమాటా పడాల్సిందే. ఏ కూరలోనైనా సులువుగా ఒదిగి నాలుకకు సరికొత్త రుచిని అందిస్తుంది. అందుకే టమాటా ఇప్పుడు కూరగాయల్లో రారాజు లాంటింది. అటువంటి టమాటా కొండెక్కి కూర్చుంది. సెంచరీని దాటి దూసుకెళ్లిపోతోంది. భారతదేశంలో ఇప్పుడు ఖరీదైన కూరగాయ ఏదైనా ఉందంటే అది టమాటానే. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, పంట ఉత్పత్తి సరిగా లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వినియోగ దారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
టామాటా ధరలకు భయపడి ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థలు తమ ఉత్పత్తుల్లో టమాటాలు వాడడం నిలిపివేశాయి. రెండు వారాల నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. తాజాగా ఈ జాబితాలోకి సబ్‌వే చేరింది. భారత్ లోని చాలా సబ్‌వే అవుట్లెట్లలో టామాటా వినియోగం ఆపేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లోని సబ్‌వే ఔట్‌లెట్ టమాటలు వినియోగించడం లేదంటూ డిస్‌ప్లే చేసింది. వీలైనంత వేగంగా టమాటా ఉత్పత్తులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్ని బ్రాంచుల్లో ఈ పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన వివరాలు లేవు. భారత దేశం అంతటా కొన్ని ఔట్లెట్లలో అందిస్తున్నా ఢిల్లీలోని రెండు, ఉత్తరప్రదేశ్ లో ఒకటి, చెన్నైలో ఒకటి టమాటాలను ఉపయోగించడం లేదని సబ్ వే ఉద్యోగి ఒకరు తెలిపారు.
రెండు వారాల క్రితం దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. పెరిగిన ధరలతో ఇలా చేయడం లేదని.. తమ నాణ్యతా ప్రమాణాలకు తగిన టమాట (Tomato Price) సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని సదరు రెస్టారెంటు చెబుతోంది. అందుకే మెనూలో వాటిని తొలగించామని వెల్లడించింది. ఈ మేరకు రెస్టారెంట్ల ముందు నోటీసులు అతికించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఫలితంగా టమాటా ధర దేశ వ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతోంది. కొత్త పంట వస్తే కానీ ధరలు తగ్గువని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో దాదాపు పంట విస్తీర్ణం తగ్గిపోగా ఏపీలోని మదనపల్లి, నగరి నుంచి మాత్రమే టమాటా మార్కెట్లోకి వస్తున్నది. స్థానిక అవసరాలి మినహాయించిన తర్వాతే ఈ పంటను మార్కెట్లోకి పంపిస్తున్నారు.. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మదనపల్లి నుంచి వచ్చే టమాటా ఈ మూలకూ సరిపోవడం లేదు. ఇక ఇదే ఆధునిక వ్యాపారులు ధరలు మరింత పెంచుతున్నారు.. ఫలితంగా మెక్ డోనాల్డ్స్ తీసేసినట్టే చాలామంది గృహిణులు తమ వంటల్లో నుంచి టమాటాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు.
టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. రాత్రి పూట దొంగలు పొలాల్లో చొరబడి కాయలను కోసుకుపోతున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతుకు చెందిన పొలంలో టమాటా పంట అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను దుండగులు ఎత్తుకెళ్లారు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని మార్కెట్‌లో టమాటాతో పాటు పచ్చిమిర్చి బాక్సులు చోరీకి గురయ్యాయి.