విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ సోమవారానికి వాయిదాపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పెగాస‌స్  ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడో రోజు కూడా సెగలు పుట్టించింది. పెగాస‌స్ స్పైవేర్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పెద్దలసభ రాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్‌పై సస్పెన్షన్  వేటు వేయడం ఆందోళనకు దారి తీసింది.  




 కేంద్ర ఐటిశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతిలోనుంచి పత్రాలను లాక్కొని వాటిని చించివేసినందుకు గానూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై చర్చించేందుకు రాజ్యసభా పక్ష నేత పీయుష్ గోయల్ ప్రతిపక్ష పార్టీలతో  మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సమావేశమయ్యారు. శంతను సేన్ పత్రాలు చించివేసిన వెంటనే ఆయన సస్పెన్షన్ కోసం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శంతన్ సేన్ ఉంటే సభ సజావుగా సాగదని పేర్కొంటూ సమావేశాల నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు చైర్మన్ వెంకయ్య నాయుడు 




మరోవైపు ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని దేశన్యాయవ్యవస్థ, ప్రతిపక్షనేతలపై ఎక్కు పెట్టడం, జర్నలిస్టులపై నిఘా పెట్టడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తన ఫోన్లన్నింటిని కూడా ట్యాప్‌ చేసిన ఉంటారనిఆరోపించారు. దీనిపై జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.  




ఇక  రాజ్యసభలో రెండు కీలకమైన అంశాలపై చర్చ కోరుతూ వైసీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. వీటిపై చర్చకు అనుమతించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడిను వారు కోరారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజ్యసభలో పోలవరం, పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు వైయస్ఆర్సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు, సవరించిన అంచనాల ప్రకారం పోలవరం నిధులు విడుదలలో జాప్యంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రెడ్డి నోటీసు ఇచ్చారు. అలాగే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అనుసరించి.. పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 క్రింద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నోటీసు ఇచ్చారు.




తమ పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ విధానాల్ని వ్యతిరేకిస్తున్నారు. లోక్ సభ స్పీకర్ కు ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఆయనపై వేటు కోసం ఫిర్యాదు కూడా చేశారు. పార్లమెంటు సచివాలయం నుంచి ఆయనకు నోటీసులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చర్చ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్ సభ స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం నిధులపై సీఎం జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేసినా నిధులు మాత్రం విడుదల కావడం లేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ఎంపీలు రాజ్యసభలో చర్చ కోరుతున్నారు.