India: సమస్య ఏదైనా, దేశం ఏదైనా భారతీయులను రక్షించుకోవడంలో భారత్ ముందుంటుందని మరోసారి నిరూపించుకుంది. హమాస్‌తో యుద్ధంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ బుధవారం 'ఆపరేషన్ అజయ్'ను ప్రకటించింది. 212 మందితో కూడిన తొలి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా భారత గడ్డపై కాలు మోపిన తరువాత ప్రజలు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రభుత్వం తమను వెనుకకు తీసుకురావడంలో చూపిన చొరవకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో సూడాన్ నుంచి 136 మంది విదేశీ పౌరులతో సహా 4,097 మందిని తిరిగి తీసుకువచ్చిన ఆపరేషన్ కావేరి తర్వాత, భారత్ చేపట్టిన రెండో తరలింపు కార్యక్రమం ఆపరేషన్ అజయ్. యుద్ధం, ఇతర సంక్షోభాల కారణంగా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన తన పౌరులను రక్షించడం, సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో భారత్ ఎల్లప్పుడు ముందే ఉంటుంది. పౌరుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ తరలింపులు చేపడుతుంది. ఆపరేషన్ అజయ్ కంటే ముందుగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను చాలా సార్లు భారత్ సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు పలు ఆపరేషన్లను చేపట్టింది. అవి ఏంటో తెలుసుకుందాం..


ఆపరేషన్ గంగా (ఫిబ్రవరి 2022)
గత ఏడాది నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులను రక్షించడానికి భారత ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ గంగ చేపట్టింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు మంత్రులను నాలుగు పొరుగు దేశాలకు పంపారు. ఆపరేషన్ గంగా 18,282 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చింది.


ఆపరేషన్ దేవి శక్తి (ఆగస్టు 2021)
2021లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం 2021 ఆగస్టులో ఆపరేషన్ దేవి శక్తిని చేపట్టింది. ఈ మిషన్ కింద మొత్తం 669 మందిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించారు. ఇందులో 448 మంది భారతీయులు, 206 మంది ఆఫ్ఘన్‌లు ఉన్నారు, ఇందులో ఆఫ్ఘన్ హిందూ/సిక్కు మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు.


ఆపరేషన్ సంకట్ మోచన్ (జూలై 2016)
దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో 2016 జులై 07న రెండు వర్గాల విద్వేషాలు చెలరేగాయి. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రజా వినియోగాలు, సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దక్షిణ సూడాన్‌లోని భారత పౌరులను రక్షించడానికి రంగంలోకి దిగింది. ఆపరేషన్ సంకట్ మోచన్‌ను ప్రారంభించింది. ఇందులో 153 మంది భారతీయులు, 2 నేపాల్ పౌరులను సురక్షితంగా తరలించింది. 


ఆపరేషన్ రాహత్ (మార్చి-ఏప్రిల్ 2015)
యెమెన్‌లో 2015 మార్చి, ఏప్రిల్ నెలలో సంక్షోభం ఏర్పడింది. అక్కడ ఉన్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ రాహత్‌ను ప్రారంభించింది, యెమెన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులతో పాటు విదేశీ పౌరులను సురక్షితంగా తరలించి మానవత్వం చాటుకుంది. ఈ ఆపరేషన్ కింద, 4,748 మంది భారతీయులు, 1,962 మంది విదేశీ పౌరులతో సహా 6,710 మందిని యెమెన్ నుంచి భారత సాయుధ బలగాలు తరలించాయి.


ఆపరేషన్ మైత్రి (ఏప్రిల్ 2015)
నేపాల్‌లో 2015 ఏప్రిల్‌లో భూకంపం సంభవించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో భారత్ మరోసారి కదిలింది. నేపాల్‌లో రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాల్లోనే భారత్ స్పందించింది. భారత సాయుధ దళాలు దాదాపు 5,188 మందిని తరలించగా, దాదాపు 785 మంది విదేశీ పర్యాటకులకు ట్రాన్సిట్ వీసాలు అందించారు.


ఆపరేషన్ సేఫ్ హోమ్‌కమింగ్ (ఫిబ్రవరి 2011)
లిబియా 2011 ఫిబ్రవరిలో అంతర్యుద్ధం మొదలైంది. దీంతో అక్కడ ఉన్న భారత పౌరులను తరలించడానికి 2011 ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ నిర్వహించింది. ఇండియన్ నేవీ, ఎయిర్ ఇండియా కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లిబియాలో పని చేస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయుల్లో 15 వేల మందికి పైగా భారత్ తీసుకొచ్చారు. దాదాపు రరెండు వారాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. 


ఆపరేషన్ సుకూన్ (జూలై 2006)
లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 2006 జులైలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో భారతీయలను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ 'సుకూన్' ప్రారంభించింది. ఈ మిషన్ కింద భారత నావికాదళానికి చెందిన నాలుగు నౌకలను మోహరించారు.  భారతీయ నావికాదళం 2006 జూలై 20-29 మధ్య బీరూట్ నుంచా 2,280 మంది వ్యక్తులను ఖాళీ చేయించింది. వీరిలో 69 మంది నేపాలీలు, 436 మంది శ్రీలంక,  ఏడుగురు లెబనీస్ జాతీయులు ఉన్నారు.


కువైట్ నుంచి ఎయిర్‌లిఫ్ట్ (ఆగస్టు - అక్టోబర్ 1990)
1990లో కువైట్, ఇరాక్ యుద్ధ సమయంలో భారత్ అతి పెద్ద ఎయిర్ లిఫ్ట్ చేపట్టింది. కువైట్‌ను ఇరాక్ దళాలు ఆక్రమించిన తర్వాత ఆగస్టు, అక్టోబర్ మధ్య ఈ ఆపరేషన్ జరిగింది. దాదాపు 1,75,000 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించినందుకు ఎయిర్ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. దీనిపై సినిమా కూడా వచ్చింది.