టెక్నాలజీ పరంగా భారతీయ రైల్వే చాలా అభివృద్ధి సాధించింది. హైటెక్ సౌకర్యాల నుంచి హైస్పీడ్ రైళ్ల వరకు రైళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు టిల్టింగ్ రైలు గురించి చర్చ నడుస్తోంది. ఇది త్వరలోనే మన దేశానికి రానుంది. 


Tilting Train in India:  గత కొన్నేళ్లలో భారతదేశంలో అనేక హైస్పీడ్ రైళ్లు వచ్చాయి. వందేభారత్ అందుకు ఉదాహరణ. ప్రస్తుతం దేశంలో ఉన్నవాటిలో ఇదే హైస్పీడ్ ట్రైన్. అయితే ఇప్పుడు టిల్టింగ్ ట్రైన్ గురించి చర్చ జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.... త్వరలోనే భారత్ లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. వీటి రాకతో ప్రయాణ సమయాలు తగ్గనున్నాయి. మరి ఈ టిల్టింగ్ రైలు అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి? ఇది సాధారణ రైలు నుంచి భిన్నంగా ఎలా ఉంటుంది? అనే వాటి గురించి తెలుసుకుందామా....


టిల్టింగ్ ట్రైన్ లేదా టిల్టింగ్ సాంకేతికత అంటే ఏంటి?


టిల్టింగ్ అనేది ఒక ప్రత్యేకమైన సాంకేతికత. దీని ద్వాారా రైలు టర్నింగ్ తిరిగేటప్పుడు కూడా చాలా వేగంగా వెళ్లగలదు. ఇప్పటివరకు ఉన్న హైస్పీడ్ రైళ్లు వంపు తిరిగేటప్పుడు తమ స్పీడును తగ్గించుకుంటాయి. ఎందుకంటే టర్నింగ్ తిరిగేటప్పుడు ఫాస్ట్ గా వెళితే రైళ్లోని వస్తువులు, నిలబడిన మనుషులు పడిపోతారు. కాబట్టి తిన్నగా ఉన్న ట్రాక్ మీద ఎంత ఫాస్టుగా వెళ్లే రైళ్లయినా... టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి స్లో అవుతాయి. అయితే ఈ టిల్టింగ్ టెక్నాలజీతో వంపు తిరిగేటప్పుడు అదే స్పీడుతో రైలు వెళ్లవచ్చు. అలా వెళ్లేటప్పుడు వస్తువులు, మనుషులు పడిపోకుండా ఈ సాంకేతికత సాయంతో రైలే బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది.  బ్రాడ్ గేజ్ ట్రాకులపై సులువుగా వెళ్లడం, అధిక వేగంతో ప్రయాణాన్ని పూర్తిచేయడం వీటి ప్రత్యేకత. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇది మోటార్ సైకిల్ లా పనిచేస్తుంది. 


వందే భారత్ రైళ్లలోనూ..


ప్రస్తుతం భారతదేశంలోని ప్రీమియం రైళ్లలో ఒకటైన వందే భారత్ రైళ్లలో ఈ సాంకేతికతను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త రైళ్లతో పాటు వందేభారత్‌లో కూడా ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. తద్వారా ఇది టిల్టింగ్ రైలులా కూడా పని చేస్తుంది. 


వేరే దేశాల్లో ఇప్పటికే దీన్ని వాడుతున్నారు


ఇటలీ, పోర్చుగల్, ఫిన్లాండ్, రష్యా, చెక్ రిపబ్లిక్, యూకే, స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ వంటి దేశాల్లో  ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ రైలు యొక్క ప్రధాన ఉద్దేశం రొటేషన్ సమయంలో రైలు యొక్క బ్యాలెన్స్‌ను సరిగ్గా నిర్వహించడం. 2025 నాటికి ఈ సాంకేతికత భారత్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.