Ticketless Passengers In Kumbha Express: ఇండియన్ రైల్వే (Indian Railway) గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం కోట్లాది మందిని గమ్యాలకు చేరుస్తుంది. టికెట్ ధరలు అందరికి అందుబాటులో ఉంటూ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అయితే వాటిలో కూడా చాలా మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. తమకు నచ్చిన బోగీలో ఎక్కి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. జనరల్, స్లీపర్, ఏసీ అంటూ తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఎక్కుతూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు.
ఈ టికెట్ లేకుండా తిరిగే వారి సంఖ్య ఉత్తరాదిలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఏసీ బోగీల్లో సైతం ఎక్కి దర్జాగా కూర్చుంటారు. సీటు రిజర్వ్ చేసుకున్న వారిని ఇబ్బందులు పెడుతూ వారి సీట్లనే ఆక్రమిస్తారు. ఏమైనా అడిగితే దాడి చేస్తారు. రైల్వే పోలీసులు వారిని ఏమీ అనరు. టీటీఈ/టీసీలు పట్టించుకోరు. అలాంటి వారితో ఏసీ బోగి సైతం జనరల్ కంపార్ట్ మెంట్‌గా దర్శనమిస్తుంది. డబ్బుపెట్టి సీటు బుక్ చేసుకున్నవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.
తాజాగా ఇలాంటి పరిస్థితే ఓ ఐఎఫ్ఎస్ అధికారికి ఎదురైంది. ఏసీ కంపార్ట్‌మెంట్‌లో టికెట్ లేకుండా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎక్కిన వీడియాలను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. తమకు జరిగిన అసౌకర్యానికి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేశారు. వివరాలు.. IFS అధికారి ఆకాష్ వర్మ (Akash K Verma) హౌరా నుంచి మొరదాబాద్ వెళ్తున్న కుంభ ఎక్స్‌ప్రెస్ (Kumbha Express - 12369)లో సెకండ్ ఏసీలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున సాధారణ ప్రయాణికులు, టికెట్ లేని వారు బోగిలోకి ఎక్కారు. అడుగు తీసి అడుగు పెట్టలేనంతగా కిక్కిరిసింది.
దానిని వీడియో తీసి సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్‌లో) షేర్ చేశారు. అనధికార వ్యక్తులు బెర్త్‌లను ఆక్రమిసస్తున్నారని, ప్రయాణికులను వేధిస్తున్నారని, ఎమర్జెన్సీ చైన్ లాగుతున్నారని, ఇలాంటి వారి కారణంగా సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడినట్లు ట్వీట్ చేశారు. దీనిపై రైల్వే శాఖ జోక్యం చేసుకోవాలని, కోచ్‌ను శుభ్రం చేయాలని కోరారు. ఇండియన్ రైల్వే, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై రైల్వే సేవ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవడానికి పీఎన్ఆర్, ఫోన్ నెంబర్ షేర్ చేయాలని కోరింది.
వీడియోలో కోచ్ మొత్తం ప్రయాణికులు నిండిపోయారు. కోచ్‌లో రాకపోకలు సాగించడానికి ఉపయోగించే ఖాళీ స్థలంలో ఖాళీ లేకుండా ఆక్రమించేశారు. అందులో ఉన్న రైల్వే పోలీసులు సైతం వారిని ఏమీ అనకపోవడం కనిపించింది. దీంతో రైల్వే శాఖ నిర్లక్ష్యంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. గతంలో తమకు జరిగిన అనుభవాలను అక్కడ పంచుకుంటున్నారు. రైళ్లలో భద్రత, సౌకర్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే తక్షణం చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.