Threat to Ayodhya Ram Mandir: కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అవన్నీ బూటకపు బెదిరింపులని తేలింది. కానీ, బాంబు బెదిరింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆఖరికి ఉగ్రవాదులు అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన రామమందిరాన్ని కూడా వదల్లేదు. రామ మందిరాన్ని పేల్చేస్తామని ఉగ్రవాద సంస్థ జైష్ - ఎ - మహ్మద్ బెదిరింపులకు పాల్పడింది. ఈ మేరకు ఓ బెదిరింపుల ఆడియో విడుదల చేసింది. దీంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. రామ మందిరానికి భద్రతను మరింత పెంచారు.


అయోధ్యలో ప్రధాన ప్రదేశాలైన మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర ప్రధాన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీగా భద్రతను పెంచారు. జిల్లా ఉన్నత పోలీసు అధికారి రాజ్ కరణ్ నయ్యర్ స్వయంగా వాల్మీకి ఎయిర్ పోర్టుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. రామ మందిరం చుట్టుపక్కల కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. అయోధ్యలను వివిధ జోన్లను ఏర్పాటు చేసి వాటి వారీగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.


బాంబు పెట్టామని ఓ ఆడియో విడుదల
రామ మందిరంపై బాంబులు వేస్తామని జైష్ - ఎ - మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరించిందని జాతీయ వార్తా సంస్థలు రాశాయి. దీంతో రామమందిరంతో పాటు, మొత్తం అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌పథ్‌లో భద్రతా ఏర్పాట్లు కూడా బాగా పెంచారు. 


ఆ ప్రదేశంలో మసీదును తొలగించి గుడి కట్టినట్లు అమీర్ అనే ఉగ్రవాది ఆడియోలో చెబుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేయాల్సి ఉందని.. అందుకోసం ఇప్పటికే తమ ముగ్గురు సహచరులు బలి అయ్యారని ఆ ఆడియోలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు బాంబులు వేయబోతున్నారని ఆ ఆడియో టేపులో ఉండడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.


2005లో ఉగ్రదాడి
అయోధ్యలో రామ మందిరం కట్టడం, అది ప్రారంభం అయినప్పటి నుంచి అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పెంచారు. ఎందుకంటే అప్పటికే ఇక్కడ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. 2005లో ఒకసారి ఉగ్రదాడికి యత్నించినా భద్రతా సంస్థలు దాన్ని విఫలం చేశారు. ఇప్పుడు మరోసారి జైష్ - ఎ - మహ్మద్ ఉగ్రవాది ఆడియో కలకలం రేపుతోంది.