Pariament Elections: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్చి 3వ తేదీన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మార్చి 9వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటనకు రెడీ అవుతున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో 3న మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుండటం కీలకంగా మారనుంది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశముండదు. దీంతో 3న జరిగే కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఢిల్లీలోని చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు జరుగుతున్న ఈ సమావేశం కీలకంగా మారింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఈ రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కేబినెట్‌లో కీలక నిర్ణయాల తీసుకునే అవకాశం లేకపోలేదు.


2014 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మార్చి 5వ తేదీన ప్రారంభమవ్వగా..  మే 16న ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిది విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మార్చి 10న స్టార్ట్ అవ్వగా. మే 23న కౌంటింగ్ జరిగింది. అప్పుడు ఏడు విడతల్లో ఎన్నికలు జరిపారు. వాటిని బట్టి చూస్తే మార్చి 10లోపు ఈ సారి ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈసీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అధికారులతో ఎన్నికల నిర్వహణపై చర్చించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దిశానిర్దేశం చేసింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచనలు చేసింది. దీంతో మార్చిలో ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశముండటంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. దేశంలోని పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. త్వరలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనుండగా.. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు.  అటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికలపై స్పీడ్ పెంచాయి. బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.


మరోవైపు లోక్‌సభ ఎన్నికలపై సర్వేల హడావుడి కూడా మొదలైంది. పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు సర్వే సంస్థలు ప్రజల నాడిని పసిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి బీజేపీకే సర్వేలు పట్టం కడుతుండగా.. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్ సీట్లు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల బలం కూడా ఈ సారి ఎన్నికల్లో పెరుగుతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.