Detonators Found Outside Kalyan Railway Station: ముంబై: మహారాష్ట్రలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో డిటోనేటర్లు కలకలం రేపాయి. థానే జిల్లా కళ్యాణ్ రైల్వే స్టేషన్ (Kalyan Railway Station) సమీపంలో దాదాపుగా 54 డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, ముంబై పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. 


దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ద పెద్ద కొండలను, పర్వతాలను విచ్ఛిన్నం చేయడానికి, క్వారీలలో బ్లాస్టింగ్ కోసం ఈ డిటోనేటర్లను వినియోగిస్తారు. అయితే కళ్యాణ్ రైల్వేస్టేషన్ కు అతి సమీపానికి ఈ డిటోనేటర్లను ఎవరు తీసుకొచ్చారు అనేది తేలాల్సి ఉంది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా అక్కడ మరిచిపోయారా, లేక ఉద్దేశపూర్వకంగానే డిటోనేటర్లను రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ 1 సమీపంలో వదిలివెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


రద్దీగా ఉండే స్టేషన్లలో కళ్యాణ్ ఒకటి.. 
థానే జిల్లాలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ 1 సమీపంలో రెండు బాక్సులు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని తనిఖీ చేయగా అందులో 50కి పైగా డిటోనేటర్లు గుర్తించామని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. సెంట్రల్ రైల్వే మార్గంలో రద్దీగా ఉండే స్టేషన్లలో కళ్యాణ్ ఒకటి. కళ్యాణ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నెం. 1లో బాక్సులను గుర్తించి పరిశీలించగా.. అందులో డిటోనేటర్లు ఉన్నాయని చెప్పారు. వెంటనే డాగ్ స్క్వాడ్,  బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. 


బాంబ్ స్క్వాడ్ టీమ్ డిటోనేటర్లు ఉన్న బాక్సులను స్వాధీనం చేసుకుంది. వాటిలో మొత్తం  54 డిటోనేటర్లు ఉన్నాయని BDDS బృందం పేర్కొంది. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేయలేదు కానీ కళ్యాణ్ జీఆర్పీ టీమ్ దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ అధికారి వెల్లడించారు. రైల్వే స్టేషన్ సమీపంలో డిటోనేటర్లు లభ్యం కావడంతో.. థానే సిటీ పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు రైల్వేస్టేషన్ కు చేరుకుని ఆ స్థలాన్ని పరిశీలించారు. 


థానే జిల్లాలో సరస్సులలో అక్రమంగా చేపలు పట్టడం (Fish Hunt)తో పాటు క్వారీలలో పేల్చడానికి ఈ డిటోనేటర్లను వినియోగిస్తారు. నీటిలో షాక్ వేవ్స్ పంపి చేపల్ని పడతారు. అయితే ముంబై సిటీ శివారులో ప్రయాణికులతో కళ్యాణ్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంటుంది. అలాంటి చోట డిటోనేటర్లు కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.