Kandrakota Village Mysterious Devil: కాండ్రకోట: నెల రోజులుగా కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామాన్ని వణికించిన అదృశ్యశక్తి భయం ఇంకా పలు చోట్ల నీడలా వెంటాడుతోంది. ఈ భయంతో ఇప్పటికీ పలువురు కాండ్రకోట గ్రామస్తులు (Kandrakota Village) వారం రోజుల కిందటి పరిస్థితులు గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారు. అదృశ్య శక్తి (Ghost in Kakinada)ని తాము స్వయంగా చూశామని, చాలా భయంకరంగా కనిపించాడని కొందరు చెప్పగా మరికొందరు చూసినవాళ్లు చెబితే విన్నామని చెబుతున్నారు. అయితే ఈ భయంతో ఇంకా చాలా రైతులు సాయంత్రం 6 దాటిందంటే చాలు పొలాలనుంచి ఇళ్లకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకునే రైతులు చాలా మంది వెలుతురు వచ్చేవరకు బయటకు అడుగుపెట్టడం లేదని చెబుతున్నారు.
రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు. ఏం జరుగుతుందోనని ఆందోళనకు చెందుతున్నారు. మొన్నటి వరకు వీధుల్లో కర్రలు, ఆయుధాలు చేతపట్టి పహారా కాచిన గ్రామస్తులు ఇప్పుడు తలుపులు బిగించుకుని నిద్రిస్తున్నారు. వీధి దీపాలతోబపాటు కొందరు ప్రత్యేకంగా ఏర్పాటు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. చాలా మంది ఇంటి బయట, వీధుల్లోనూ రాత్రంతా లైట్లు వేసే ఉంచుతున్నారు.
భయం మాత్రం వారిని నీడలా వెంటాడుతోంది..
ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి బాగానే ఉందని, అయితే అదృశ్య శక్తి భయం మాత్రం ఇంకా నీడలా వెంటాడుతోందని చాలా మంది తెలిపారు. ఇదిలా ఉంటే గ్రామంలో యువకులు మాత్రం అదృశ్యశక్తి కాదని గ్రామంలో ఒకరు తిరగడం మాత్రం వాస్తవమేనని, గ్రామంలో అలజడి రేగింది కనిపించని ఆ మనిషి వల్లనేనని తెలిపారు. ఇవి అన్నీ అపోహలు, భయాలు అని చెబుదామంటే మీ ఇంట్లో జరిగితే మీకు తెలిసేది అంటూ తమపై ఎదురు దాడిచేసిన క్రమంలో తామేమీ మాట్లాడలేకపోయేవాళ్లమని మరి కొందరు యువకులు తెలిపారు.
అక్కడి పరిస్థితి ఎలా ఉంది.. గ్రామస్తులు ఏం చెబుతున్నారు..?
కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో చేపట్టిన హోమాలు, యాగాలు వల్లనే అదృశ్య శక్తి భయం వీడిందా అని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం.. దీనికి చాలా మంది గ్రామంలో ఇప్పుడు ఎటువంటి అదృశ్యశక్తి లేదని, ఊరంతా ప్రశాంత వాతావరణం ఉందని తెలిపారు. కొందరైతే అదృశ్యశక్తి వేరే గ్రామానికి వెళ్లిపోయిందని అనుకుంటున్నారని, ఇప్పుడు గ్రామంలో చాలా వరకు భయం తగ్గిందని చెబుతున్నారు. గ్రామంలో దెయ్యంపై ఉన్న భయం గ్రామ దేవత నూకాలమ్మపై లేదని, నూకాలమ్మపై నమ్మకం పెట్టుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు తెలిపారు.
గ్రామంలో పెరిగిన పూజలు, కార్యక్రమాలు
గ్రామంలో నెలకొన్న భయంతోనే నూకాలమ్మ అమ్మవారి శక్తి మరింత పెరిగేలా, శివాలయం శక్తి పెరిగెలా చండీయాగాలుతోపాటు పలు పూజలు నిర్వహించారని, ఈ పూజల వల్ల అదృశ్యశక్తి గ్రామం నుంచి పారిపోయిందని ధైర్యంగా చెబుతున్నారు. గ్రామంలో ప్రజలకు నెల రోజులుగా నిద్ర కరువైందని, ఇప్పుడు చాలా వరకు ప్రశాంతంగా పడుకుంటున్నారని తెలిపారు. చానెళ్లలో వస్తున్న వార్తల నేపథ్యంలో దూరంగా ఉన్న తమ బంధువులు చాలా మంది కాండ్రకోటను వదిలి వచ్చేయమంటున్నారని, తమ గురించి ఆందోళన చెందుతున్నారని, కానీ కాండ్రకోటలో ఇప్పుడు పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు.