Sadguru on Kalaripayattu: 


సద్గురు: బహుశా కలరిపయట్టు ఈ భూమ్మీదనే అత్యంత పురాతనమైన యుద్ధకళ కావచ్చు. దీనిని తొలిసారి అగస్త్య ముని ప్రపంచానికి పరిచయం చేశారు. యుద్ధకళ అంటే కేవలం తన్నుకోవడమో లేదా కొట్టుకోవడమో కాదు. ఇందులో సాధ్యమైనంత వరకు మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాం. అయితే, ఇది వ్యాయామం కోసమే కాదు. ఇది మన శరీరంలో ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోడానికీ ఉపయోగపడుతుంది. ఇందులో కలరి చికిత్స, కలరి మర్మ అనే రెండు కళలు ఉన్నాయి. వీటి ద్వారా శరీర రహస్యాలు తెలుసుకొని, త్వరగా కోలుకొని, శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కలరి అభ్యాసకులు చాలా తక్కువ మంది ఉండచ్చు. అయితే, ఈ కళలో ఆరితేరిన వాళ్లు యోగా వైపూ మళ్లుతారు. ఎందుకంటే ఈ కళలోనూ ఆధ్యాత్మికత ఉంది కాబట్టి. ఆ ఆధ్యాత్మిక అన్వేషణకు అగస్త్య ముని దారి చూపించారు. కానీ మన శరీరంలో మనం ఇంకా అన్వేషించని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఊరికే అలా మిమ్మల్ని తాకి, మిమ్మల్ని చంపగల కరాటే మాస్టర్లు ఉన్నారు. కేవలం తాకి చంపగలగడంలో పెద్దగా చెప్పుకోదగినది ఏమీ లేదు. అదే మిమ్మల్ని తాకి మీలో చైతన్యం నింపడం చాలా గొప్ప విషయం.


ప్రజలు కేవలం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నట్లయితే, దాన్ని చాలా సునాయాసంగా సాధించవచ్చు. నాకు అదేమీ పెద్ద సవాలుగా అనిపించదు. కానీ, మేము మానవులలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన అంశాలను వెలికి తీయాలనుకుంటున్నాము. దీనికి అసాధారణమైన ఏకాగ్రత, అంకితభావం అవసరం. ప్రకృతి నిర్దేశించిన పరిమితులను దాటి జీవితాన్ని తెలుసుకోవాలంటే అందుకు ఒక విధమైన వ్యక్తులు కావాలి. మానవాళిలో 99.99% మంది కనీసం తమ శరీరాన్నైనా పూర్తిగా అన్వేషించకుండానే చనిపోతున్నారు. అదే, మీరు దీనిని అన్వేషిస్తే, ఊరికే అలా కూర్చొని ఈ శరీరంతో ఎన్నో అద్భుతమైన పనులు చేయగలరు. యోగా అనుసరించే మార్గం ఇదే. కలరి దీనికి సంబంధించినదే అయినా ఇంకాస్త చురుగ్గా చేయాల్సి ఉంటుంది.


వన్యమృగాల నుండి మనల్ని రక్షించుకోవడానికి కలరి ఉద్భవించింది. యుద్ధ కళలకు దక్షిణ భారతదేశమే పుట్టినిల్లు. అగస్త్యముని సన్నగా, పొట్టిగా ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉండేవారు. ప్రధానంగా అడవి మృగాలతో పోరాడటానికి ఆయన యుద్ధ కళలు అభివృద్ధి చేశారు. ఒకప్పుడు ఈ నేలపై పులులు చాలానే ఉండేవి. ఇప్పుడు మనం వాటిని తేలిగ్గా లెక్కపెట్టొచ్చు. సుమారు వెయ్యికి పైగా పులులు మాత్రమే బ్రతికి ఉన్నాయి. కానీ, అప్పట్లో వేల సంఖ్యలో పులులతో పాటు మిగతా ప్రమాదకరమైన వన్యమృగాలు సంచరించేవి. అందుకే అగస్త్యముని కలరిని వన్యమృగాలతో పోరాడేందుకు మనల్ని సంసిద్ధం చేసే విధంగా రూపొందించారు. అంటే, ఒక పులి వస్తే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఈ కళ ఇప్పటికీ సజీవంగా ఉంది. 


ప్రజలు హిమాలయాలు దాటినప్పుడు, అక్కడ నివసించే అడవి మనుషులను ఎదుర్కోవాల్సి వచ్చేది. వాళ్ళు ప్రయాణికులపై దాడి చేయాలని చూసేవారు. వన్యమృగాలను ఎదుర్కోవడానికి నేర్చుకున్న విద్యను ఆటవికులపై ఉపయోగించడం ప్రారంభించారు. వారు దానిని మనుషులపై ప్రయోగించడం మొదలుపెట్టిన తరవాత ఇందులో ఎంతో మార్పు వచ్చింది. భారతదేశం నుండి చైనాకి ఇంకా ఆగ్నేయాసియా వరకు...ఇది ఏ విధంగా దాక్కొని పోరాడే యుద్ధ కళ నుండి ధైర్యంగా నిలబడి పోరాడే యుద్ధ కళగా మారిందో చూడొచ్చు. 


మనుషులతో పోరాడినప్పుడు, చంపడానికే పోరాడుతారు. కానీ, వన్యమృగాలతో అలా కాదు. ఒకసారి, మీరు వాటికి అంత సులువుగా దొరకని ‘ఆహారం’ అని తెలిస్తే, అవి వెళ్ళిపోతాయి. అలా సహజంగా వన్యమృగాలను తరిమికొట్టడానికి రూపొందించిన ఈ అద్భుత కళారూపం కాలక్రమేణా ప్రాణాలు తీసేలా రూపాంతరం చెందింది. కలరి నుండి కరాటేగా ఇది ఎలా రూపాంతరం చెందిందో మీరు చూడొచ్చు. కొంతకాలం తర్వాత, భారతదేశంలోనూ ఈ కళను ఇతరులతో పోరాడటానికి ఉపయోగించారు. కానీ, ఇందులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, మనవాళ్లు  ఆయుధాలు చేపట్టారు. కొంచెం పరీక్షిస్తే, కలరి కరాటే అంత సమర్థవంతంగా ఉండదు. ఎందుకంటే, కరాటేలో రెండు కాళ్ల మీద నిలబడతాము. కలరిలో, పొంచి ఉన్న దానితో పోరాడటానికి ప్రయత్నిస్తుంటారు, ఎందుకంటే మనవాళ్ళు ఎప్పుడూ దీనిని మరొకరితో పోరాడే సాధనంగా చూడలేదు. దీనిని కేవలం వన్యమృగాలతో పోరాడటానికే ఉపయోగించే వాళ్ళు.


భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన యాభై మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటున్న సద్గురు ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన మరియు విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 390 కోట్ల ప్రజల్ని తాకిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన ‘చైతన్యవంతమైన ప్రపంచం - మట్టిని రక్షించు’ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.