Union Budget 2024 Expectations: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న.. కేంద్ర బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... ఈసారి మధ్యంతర బడ్జెట్‌ని మాత్రమే ప్రవేశపెడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకురానున్నారు. మధ్యంతర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ భారతీయ వంటకమైన హల్వా వేడుక జరిగింది. ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ పాల్గొన్నారు. హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు సీతారామన్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏటా ఆర్థిక శాఖ ఆనవాయితీగా నిర్వహిస్తోంది.
ప్రతిసారి బడ్జెట్ కు ముందు హల్వా వేడుక
ప్రతిసారి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. ఈ ప్రసిద్ధ భారతీయ స్వీట్‌ని భారీ కడాయిలో తయారు చేసి.. ఆర్థిక మంత్రి సిబ్బందికి వడ్డిస్తారు. ఇందుకు ఓ కారణం లేకపోలేదు. బడ్జెట్ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్ కసరత్తు మొదలవ్వగానే... నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు మీడియాపై ఆంక్షలు విధించారు. ఆర్థిక శాఖకు చెందిన కొందరు సిబ్బంది మాత్రమే ఈ క్రతువులో పాల్గొంటారు. బడ్జెట్ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోనే జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా... కుటుంబసభ్యులకు అక్కడే బస చేస్తారు. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి డాక్యుమెంట్‌లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదం పొందాక బడ్జెట్ తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సెషన్‌కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్‌ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.