అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఉపఎన్నికలు మాత్రం అచ్చి రావడం లేదు. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా పరాజయమే ఎదురొస్తోంది. చివరికి సిట్టింగ్ సీట్లను కూడా కోల్పోతోంది. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఎక్కడా గెలుపు అంచుల వరకూ రాలేకపోయారు. 


బీజేపీ , జేడియూ కూటమి అధికారంలో ఉన్న బీహార్‌లో బొచాహన్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన అభ్యర్థి అమర్ కుమార్ పాశ్వాన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. బీజేపీ - జేడీయూ కూటమి తరపున బీజేపీ అభ్యర్థినే బరిలో నిలబడ్డారు. అయినా విజయం దక్కలేదు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ వికాసిన్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 


చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఖైరాఘర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమల్ జంగల్‌పై యశోద వర్మ పాతిక వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీ తరపు అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. ఈ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 


మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సత్యజిత్ కదంపై కాంగ్రెస్ అభ్యర్థి జాధవ్ జయశ్రీ విజయం సాధించారు. గతంలోనూ ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటే. 


ఇక బెంగాల్‌లో జరిగిన ఒక అసెంబ్లీ, మరో లోక్ సభ సీట్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెల్చుకుంది. బల్లీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో మాజీ బీజేపీ నేత.. మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. ఇక బెంగాల్‌లోని అసన్ సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన బాలీవుడ్ స్టార్ శతృఘ్ను సిన్హా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సీటు బీజేపీది. ఎంపీగా ఉన్న బాబుల్ సుప్రీయో రాజీనామా చేసి తృణమూల్‌లో చేరారు. ఆయన స్థానంలో శతృఘ్ను ఎంపీ అయ్యారు.  బాబుల్ సుప్రీయో ఎమ్మెల్యే అయ్యారు.