Telecom Regulatory Authority of India: ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్న వారి ఫోన్‌ నెంబర్‌లకు ఛార్జ్‌లు వసూలు చేస్తారనే వార్తను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్‌ కొట్టిపారేసింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటన విడుదలచేసింది. ఇలాంటివి ప్రచారం జరిగినప్పుడు ఒక్కసారి అధికారిక ట్రాయ్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 


సిమ్ కార్డులు పక్కదారి పట్టకుండా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకు, సరైన వ్యక్తులకే సిమ్ కార్డులు ఇచ్చేందుకు ఛార్జ్‌లు వసూలు చేయబోతున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. సిమ్ కార్డు నెంబర్‌తోపాటు ల్యాండ్ లైన్ నెంబర్‌కి కూడా ఈ ఛార్జ్‌లు వసూలు అవుతాయని ఆ ప్రచారం పూర్తి అర్థం. 


దేశంలో ఫోన్ నెంబర్‌ల నియంత్రణ, పక్కదారి పట్టకుండా ఉండేందుకు కావాల్సిన సిఫార్సులను 2022 సెప్టెంబర్‌లోనే డాట్‌కు చేశామని ట్రాయ్ పేర్కొంది. ఆ సిఫార్సులే ఇప్పుడు అమలు అవుతున్నాయని కొత్తగా ఎలాంటి ఆదేశాు ఇవ్వలేదని పేర్కొంది. 


ఫోన్‌నెంబర్లకు ఛార్జ్‌లు వసూలు చేస్తారనే ప్రచారం ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారిక ట్రాయ్ వెబ్‌సైట్‌లో ఉన్నఅధికారులకు మెయిల్ చేయవచ్చని తెలిపింది.