Congress Party Crowd Funding : కాంగ్రెస్ పార్టీ (Congress Party) చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ కు అన్యూహ స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు విరాళాలు ఇస్తున్నారు.  డొనేట్‌ ఫర్‌ దేశ్‌ పేరు (Donate For Desh)తో ప్రారంభించిన క్రౌడ్ ఫండింగ్ ( Crowd Funding) కార్యక్రమానికి ఇప్పటి వరకు ఎనిమిదిన్నర కోట్లు ఇచ్చారు. అయితే టాప్ ప్లేస్ లో తెలంగాణ (Telangana)నిలిచినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువారం వరకు ఒక్క తెలంగాణ నుంచే కోటి 38 లక్షల విరాళం వచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ క్రౌడ్‌ఫండింగ్‌ డొనేషన్‌ డాష్‌బోర్డు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి కాంగ్రెస్ పార్టీ డోనేట్ ఫర్ దేశ్ పేరుతో విరాళాలను సేకరిస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజలు ఆన్ లైన్ లో విరాళాలను చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.8,57,71,985 వచ్చాయి. అందిన విరాళాలను ఏ రోజుకారోజు కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తోంది. 


తెలంగాణ అగ్రస్థానం
అత్యధిక విరాళాలు అందజేసిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 28వ తేదీ వరకు  రూ.1,38,46,450 అందినట్టు కాంగ్రెస్‌ పార్టీ క్రౌడ్‌ఫండింగ్‌ డొనేషన్‌ డాష్‌బోర్డు తెలిపింది. తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రం నుంచి రూ.1,07,62,909 అందాయి. రాజస్థాన్‌ నుంచి రూ. 95,76,278,  హర్యానా నుంచి రూ.86.98 లక్షలు వచ్చాయి. యూపీ రూ.60.76 లక్షల విరాళంతో ఐదో స్థానంలో నిలించింది. విరాళాల్లో తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలిచినప్పటికీ...తక్కువ మంది ఎక్కువ డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది విరాళాలిచ్చిన రాష్ట్రంగా రాజస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. సిక్కిం రాష్ట్రం నుంచి కేవలం 2,301 రూపాయలు మాత్రమే వచ్చాయి. 


కాంగ్రెస్ కు భారీగా తగ్గిన ఫండింగ్
దేశంలోని బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు, సమాజంలోని అసమానతలను అధిగమించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ క్రౌండ్ ఫండింగ్ సేకరిస్తున్నట్లు వెల్లడించింది. సంపన్న వర్గాలకు మద్దతుగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా నిలవాలన్న కాంగ్రెస్‌ నిబద్ధతకు నిదర్శమని స్పష్టం చేసింది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి కొన్నేళ్లుగా విరాళాలు రావడం భారీగా తగ్గింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఈ ప్రచార, నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల నంచి రూ.138, రూ.1,380, రూ.13,800... చొప్పున విరాళాలు సేకరిస్తోంది. 18 ఏళ్లు పైబడిన భారతీయులెవరైనా రూ.138 మొదలు రూ.1380, రూ.13,800 ఆపై ఎంతైనా విరాళం ఇవ్వవచ్చు.  138 ఏళ్ల పార్టీ ప్రయాణాన్ని ఇది గుర్తుచేస్తుందని హస్తం పార్టీ వెల్లడించింది. 


ఎక్కువ మొత్తం ఇవ్వాలనుకుంటే...
కాంగ్రెస్ అఫిషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి దాతలు విరాళాలను ఇవ్వవచ్చు. ఎక్కువ మొత్తం ఇవ్వాలనుకునే వారు వెబ్ సైట్ లోకి వెళ్లి Other ఆప్షన్ ఎంచుకోవచ్చు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు కనీసం రూ.1,380 చొప్పున విరాళం ఇవ్వాలని పార్టీ సూచించింది. ఇది దేశంలోనే అతి పెద్ద క్రౌడ్‌ పుల్లింగ్‌ ఫండ్‌ క్యాంపెయిన్‌ గా నిలవనుంది.