Viral News: ఇది డిజిటల్ యుగం. ఇక్కడ కంటెంటే కింగ్‌. సోషల్ మీడియాలో రోజుకో విషయం వైరల్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా ఫేమస్ అవుతారు. కొన్ని వీడియోలు ప్రజల్లోకి సులభంగా వెళ్లిపోతాయి. రోడ్లపై డాన్స్‌లు, బహిరంగంగా రొమాన్స్, బైక్‌పై దూసుకెళ్లే లవర్స్, ప్రాంక్ వీడియాలు ఇలా ప్రతిదీ వైరల్ అయ్యే అంశమే. వాటిలో చాలా తక్కువ శాతం సమాజానికి మంచి చేసేవి, ప్రజలను ఆలోచింప చేసేవి ఉంటాయి. ఇతరులతో ఎలా ఉండాలో ఈ వైరల్ వీడియోలు నేర్పుతాయి. 


కాలం మారే కొద్ది సమాజంలో మానవ రూపంలో ఉన్నా మృగాళ్ల సంఖ్య పెరుగుతోంది. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎంతో మంది ఆడ పడుచులు లైంగిక దాడులకు గురవుతున్నారు. వాటిలొ ఎక్కువ శాతం పసిపిల్లల మీద జరగుతున్నవే ఉన్నాయి. చాక్లెట్లు, బిస్కెట్లు, సెల్‌ఫోన్ ఆశ చూపిస్తూ చిన్నారులను దగ్గరకు తీసుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా ఘోరాలు జరుతూనే ఉన్నాయి.






పిల్లలు లైంగిక దాడుల బారిన పడకుండా వారికి అవగాహన కల్పించడం ద్వారా అలాంటి ఘోరాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. గుడ్ టచ్ ఏంటి? బ్యాడ్ టచ్ ఏంటి?అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? వివరించే వీడియో ఈ మధ్య కాలంలో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. రోషన్ రాయ్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళా టీచర్ తన విద్యార్థులకు 'గుడ్ టచ్' 'బ్యాడ్ టచ్' అనే కీలకమైన కాన్సెప్ట్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. 


వీడియోలోని ఉపాధ్యాయురాలు తలపై తట్టడం, కౌగిలించుకోవడం, శారీరకంగా, మానసికంగా బాధ కలిగించే హానికరమైన స్పర్శల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తోంది. ఇందుకోసం స్థానిక, సాధారణ భాషలో ఉదాహరణలతో వివరిస్తుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించడమే కాకుండా పిల్లలు ఎప్పుడైనా అనుచితమైన స్పర్శను అనుభవిస్తే వారి అసౌకర్యాన్ని, వారి కష్టాన్ని, భావాన్ని బయటకు చెప్పేలా ప్రోత్సహిస్తోంది. 


ట్విటర్ యూజర్ వీడియోను పోస్ట్ చేస్తూ“ఈ ఉపాధ్యాయురాలు ప్రసిద్ధి పొందటానికి అర్హురాలు. ఇది భారతదేశంలోని అన్ని పాఠశాలల్లో పునరావృతం కావాలి. మీకు వీలయినంత ఎక్కువగా షేర్ చేయండి” అని క్యాప్షన్ పెట్టారు. 


ఈ వీడియోను ఇప్పటి వరకూ 1.5 మిలియన్ల మంది చూశారు. 31 వేల మంది వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో పాఠశాలల్లో ఇటువంటి విద్య ప్రాముఖ్యతను వివరిస్తోంది.  ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ఇటువంటి విషయాలపై ప్రచారం చాలా తక్కువగా ఉంటుంది. 


దీనిపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ గురించి వివరించాలని సూచిస్తున్నారు. ఉపాధ్యాయురాలు చాలా గొప్ప పని చేస్తున్నారని కితాబిస్తున్నారు. ఇలా పిల్లలకు వివరించడం ద్వారా లైంగిక దాడుల బారిన పడకుండా నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విధానాన్ని దేశంలోని ప్రతి పాఠశాలలో వివరించాలని సూచిస్తున్నారు. 


మరి కొంత మంది స్పందిస్తూ మన పిల్లలను రక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం అని వ్యాఖ్యానించారు. చిన్నారులపై లైంగిక దాడులు జరగకుండా సమాజం, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు,  బాధ్యతను ఎత్తిచూపారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial