Zakir Hussain Died in America: ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) శాన్ ఫ్రాన్సిస్కోలోని కన్నుమూశారు. పిటిఐ కథనం ప్రకారం... ఆయన కుటుంబం సభ్యులు ఈ సమాచారాన్ని మీడియాకు అందించారు. హుస్సేన్ కుటుంబం అందించిన వివరాల ప్రకారం... ఆయన ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్యల కారణంగా మరణించారు. 73 ఏళ్ల జాకీర్‌ హుస్సేన్‌ రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయినా వైద్యులు కాపాడలేకపోయారు.


జాకర్ హుస్సేన్ సోదరి ఖుర్షీద్ కూడా మరణాన్ని ధృవీకరించారు. "ఉపాధ్యాయుడిగా, గురువుగా, అధ్యాపకుడిగా ఆయన చేసిన విశేష కృషి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసింది. భవిష్యత్‌ తరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా స్ఫూర్తిని నింపాలి. సాంస్కృతిక రాయబారిగా, గొప్ప వ్యక్తిగా విశిష్ట వారసత్వాన్ని మిగిల్చారు." హుస్సేన్‌కు భార్య ఆంటోనియా మిన్నెకోలా, కుమార్తెలు అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి ఉన్నారు.
5 సార్లు గ్రామీ అవార్డును గెలుచుకుంది


జాకీర్ హుస్సేన్ భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన శాస్త్రీయ సంగీతకారులలో ఒకరు. ఆయన్ని 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్ తబలా లెజెండ్ అల్లా రఖా కుమారుడు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఐదు గ్రామీ అవార్డులు సహా అనేక అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్నారు. గతేడాది కూడా మూడు అవార్డులు గెలుచుకున్నారు. 


జాకీర్‌ హుస్సేన్‌ తన తబల వాద్యంతో కోట్లాది మనసుల్ని హత్తుకున్న సంగీత విధ్వాంసుడు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీర్చ లేని లేటుగా ప్రముఖులు సంతాప సందేశాల్లో అభిప్రాయపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రికెట్, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
జాకీర్ హుస్సేన్ మృతిపై ఆదివారం రాత్రి నుంచి చర్చ నడుస్తోంది. మొదట ఆయన మృతి చెందినట్టు సన్నిహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్‌ చౌరాసియా సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో జాకీర్ హుస్సేన్ లేరని మీడియా మొత్తం ప్రచారం చేసింది. కాసేపటికే అది అబద్దమని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇంతకీ ఆయన పరిస్థితి ఏంటని మీడియా ఆరా తీయడం మొదలు పెట్టింది. చివరకు భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు కీలక ప్రకటన చేశారు. అనారోగ్యంతో ఐసీయూలో కన్నుమూశారని తెలిపారు. 


రెండేళ్ల క్రితమే జాకీర్‌ హుస్సేన్‌కు గుండెపోటు రావడంతో డాక్టర్లు స్టెంట్ వేశారు. 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. తర్వాత మూడు గ్రామీ అవార్డులు అందుకున్నారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్‌... జాజ్ ఫ్యూజన్లో, హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిల్లో తన నైపుణ్యంతో అద్భుతాలు చేశారు.


దివంగత తబలా ప్లేయర్ ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు జాకీర్ హుస్సేన్ కేవలం 11 ఏళ్లకే సంగీత రంగ ప్రవేశం చేశారు. ఏడేళ్లకే తబలాతో కెరీర్ ప్రారంభించారు. పదకొండేళ్లకు జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. కొన్ని దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. సుమారు 4 దశాబ్దాల కిందట కుటుంబంతోపాటు శాన్ ఫ్రాన్సిస్కోలో సెటిల్ అయ్యారు. అక్కడ కూడా సంగీత కచేరిలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.