Swami Vivekananda Jayanti speech: స్వామి వివేకానందుని ఆలోచనలు, ఆదర్శాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆధ్యాత్మిక గురువు, యోగా, వేదాంత, భారతీయ తత్వశాస్త్రాలను పాశ్చాత్య దేశాలకు అందించిన వ్యక్తి స్వామి వివేకానంద జయంతిని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరుపుకుంటోంది. ఈ ఏడాది మహారాష్ట్రలోని నాసిక్‌లో కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజనోత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలను ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ శాఖల సహకారంతో జిల్లాల్లోని యువజన వ్యవహారాల శాఖలోని అన్ని ప్రాంతీయ సంస్థలు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు, ఏడు వందల యాభై జిల్లా ప్రధాన కార్యాలయాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది "2047 నాటికి నా భారతదేశం, యువత అభివృద్ధి చెందిన భారతదేశం" పేరుతో ఉత్సవాలను నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ప్రసంగం లేదా వ్యాస పోటీ ఉంటే మీరు ఈ విధంగా ప్రసంగించి చూడండి. మీకు ప్రసంశలు రావడం ఖాయం.
విషయం: స్వామి వివేకానంద జయంతిపై ప్రసంగం
‘వేదికపై ఉన్న గౌరవనీయులైన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్న నా స్నేహితులు అందరికీ నా వందనాలు.
ఈ రోజు మనం గొప్ప ఆలోచనాపరుడు, దార్శనికుడు, యువ సన్యాసి, యువతకు స్ఫూర్తి, ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన స్వామి వివేకానంద జయంతిని జరుపుకోవడానికి ఇక్కడకు వచ్చాం. భారతదేశ ఆధ్యాత్మిక గురువుకు నేను నమస్కరిస్తున్నాను. మిత్రులారా! నేడు దేశ వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతితో పాటు, జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. స్వామి వివేకానంద బోధనలు, ఆలోచనల నుంచి కోట్లాది మంది యువత ప్రేరణ పొందారు. ఆయన చెప్పిన మాటలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయి. వివేకానందుని చురుకైన, శక్తివంతమైన ప్రసంగం ప్రజల ఆలోచలను మేల్కొల్పాయి. అందుకే ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం 38 ఏళ్లుగా 1985 నుంచి జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తోంది.
సంపన్న కుటుంబంలో జన్మించిన స్వామి వివేకానంద చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవారు, జిజ్ఞాస కలిగి ఉండేవారు. అతని మానసిక స్థితికి అతని ఉపాధ్యాయులు కూడా ముగ్ధులయ్యారు. ఆయనకు భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు కోరగా.. భార్య కోసం కాదు దేవుడి కోసం వెతుకుతున్నానని సమాధానమిచ్చేవారట.
రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత ఆధ్యాత్మికత వైపు ఆయన మొగ్గు చూపారు. రామకృష్ణుని ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించిన తర్వాత స్వామి వివేకానందగా ప్రసిద్ధి చెందారు. ఆయన శక్తికి ప్రతిరూపం. ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికారు. శ్రీరామకృష్ణ పరమహంస మరణం అనంతరం స్వామి వివేకానంద భారతదేశమంతటా పర్యటించారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో భారత వేదాంతాన్ని, తత్వాన్ని ప్రచారం చేసి భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు.
1893లో చికాగో మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచాన్ని కుదిపేసింది. 'అమెరికా సోదర సోదరీమణులారా' అంటూ స్వామి వివేకానంద తన ప్రసంగాన్ని ప్రారంభించగానే రెండు నిమిషాల పాటు సభ చప్పట్ల మోతతో మారుమోగింది. ఆ రోజు నుంచి భారతదేశ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కేవలం 30 ఏళ్ల వయసులో హిందుత్వ దృక్పథంలో వివేకానందుడు ప్రపంచానికి సోదర భావాన్ని నేర్పారు.
స్వామి వివేకానంద మనసులో ఏమాత్రం భయం ఉండదని ప్రముఖులు చెప్పిన మాట. ఆయన బానిసత్వం నుంచి పూర్తి విముక్తి పొందారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువతనే ఇస్తే దేశాన్ని మార్చి చూపిస్తానని చెప్పేవారు. ‘యువతా మేల్కొనండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి’ అని స్వామీజీ చెప్పేవారు. యువజన దినోత్సవం సందర్భంగా మనం ఆయనను స్మరించుకోవడం, నివాళులర్పించడం గొప్ప విషయం. ఆయన పంచిన జ్ఞానం, మాటలు, బోధనలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందిన భారతదేశానికి తోడ్పడదాం.
చివరగా, ఈ వేదిక పైనుంచి స్వామి వివేకానంద గురించి నా అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.’