Odisha MLA Car: ఉత్తర్ ప్రదేశ్(UttarPradesh) లో లఖింపుర్​ ఖేరి దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో మరో ఘోరం జరిగింది. ఒడిశాలోని ఖుర్దాలో బీజేడీ ఎమ్మెల్యే(సస్పెండ్) ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్(Prashant Jagdev)​ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో 15 మంది బీజేపీ(BJP) కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బానాపుర్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఆర్‌ సాహు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భువనేశ్వర్​ ఎయిమ్స్ కు తరలించారు.






మద్యం మత్తులో ఎమ్మెల్యే!


పంచాయతీ సమితి ఛైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖుర్దా జిల్లాలోని బానాపుర్ బ్లాక్​ ఆఫీస్​ ముందు పలు పార్టీల కార్యకర్తలు గుమిగూడి ఉన్నారు. ఈ సమయంలోనే బిజూ జనతా దళ్‌ (బీజేడీ) బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్దేవ్‌ కారుతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎమ్మెల్యే(MLA)పై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్​దేవ్ ​ను పోలీసులు రక్షించారు. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా గత ఏడాది సెప్టెంబరులో జగ్దేవ్‌ను బీజేడీ సస్పెండ్‌ చేసింది.


"ఈ ఘటనలో బాణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్-ఇన్చార్జ్ ఆర్ఆర్ సాహుతో సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించాం. దాదాపు 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. దీనిపై విచారణ ప్రారంభించాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 






ప్రాణ నష్టంపై నివేదిక అందలేదు  : ఎస్పీ 


ప్రజల దాడిలో గాయపడిన ఎమ్మెల్యేకు తొలుత తంగి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం భువనేశ్వర్‌కు తరలించినట్లు ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాహి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగ్దేవ్ గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. "ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నివేదిక అందలేదు" అని ఎస్పీ పాహి అన్నారు.