Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ ఘటనపై  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్న న్యాయ విచారణ సంఘం ద్వారా విచారించాలని పిల్‌లో  పిటిషనర్ డిమాండ్ చేశారు. కోర్టు పిటిషనర్‌ను తప్పుబట్టి బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపించే ప్రయత్నం చేసిన వెంటనే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సీరియస్‌ అయ్యారు.  న్యాయమూర్తులు ఎప్పుడు విచారణ నిపుణులు అయ్యారని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.  న్యాయ వివాదాల  పరిష్కరించడమే వాళ్ల పని అని గుర్తు చేశారు.  

జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ...  కాస్త బాధ్యతగా ఉండండి మీరు కూడా దేశం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలి. మొత్తం దేశం ఈ విషయంలో ఏకమై ఉంది. సైనిక దళాల మనోధైర్యాన్ని కించపరిచేలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు అని అన్నారు. పిటిషనర్ తన పిటిషన్లోని న్యాయవిచారణ డిమాండ్‌ను  వెనక్కి తీసుకుంటామని  చెప్పారు.  పిటిషన్‌లోని ఇతర అంశాలను పరిగణించాలని కోరారు.

ముందు మీరు పిటిషన్ దాఖలు చేసి ప్రచారం చేస్తారు, తర్వాత కోర్టులో  డిమాండ్‌పై వెనక్కి తగ్గుతామని చెబుతారా? అని జడ్జి నిలదీశారు. ఆ తర్వాత కోర్టు పిటిషన్‌లోని అన్ని డిమాండ్లను చదివింది. అందులో బాధితులకు పరిహారం అందించడం, పర్యాటకుల భద్రత వంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని కోర్టు అభిప్రాయపడింది.

పిటిషనర్ జమ్మూ-కశ్మీర్ వెలుపల చదువుకుంటున్న విద్యార్థుల సమస్యను లేవనెత్తాడు. అది  పిటిషన్‌లో ఎక్కడా లేదని కోర్టు తెలిపింది. విద్యార్థుల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీంకోర్టు సూచించింది.  సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను ఫతేశ్ సాహూ, జునైద్ మొహమ్మద్, వికీ కుమార్ అనే పిటిషనర్లు దాఖలు చేశారు. అందులో కేంద్రం, జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంతోపాటు CRPF, NSA, NIAలను కూడా పార్టీలుగా చేర్చారు.