Supreme Court Comments On Contesting Candidates Movable Property: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చరాస్తి వివరాలకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల బరిలో నిలిచే వ్యక్తి తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు ఉందని తెలిపింది. అభ్యర్థులు తమ ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న కచ్చితమైన హక్కేమీ కాదని వ్యాఖ్యానించింది. 'అభ్యర్థికి అత్యంత విలువైన ఆస్తులు ఉండి, విలాసవంతమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే తప్ప.. తన కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు.' అని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటే చేసే అతడు లేదా ఆమె తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు వారికి ఉందని తెలిపింది.


ఇదీ నేపథ్యం


అరుణాచల్ ప్రదేశ్ లోని తేజు ప్రాంతం నుంచి కరిఖో అనే అభ్యర్థి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికపై.. ప్రత్యర్థి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కరిఖో తన నామినేషన్ లో భార్య, కుమారుడికి చెందిన 3 వాహనాల వివరాలు వెల్లడించకుండా ప్రభావం చూపారని కోర్టుకు తెలిపారు. కాగా, కరిఖో ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందే ఆ వాహనాలు గిఫ్ట్ ఇవ్వడమో, విక్రయించడమో చేశారని గుర్తించిన న్యాయస్థానం.. వాటిని ఆ కుటుంబానికి చెందినవిగా పరిగణించలేమని పేర్కొంది. ఈ సందర్భంగా కరిఖో ఎన్నికను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అలాగే, ఆయన ఎన్నిక చెల్లదంటూ గువాహటి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కన పెట్టింది.


Also Read: Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు - అరెస్టును సమర్థించిన కోర్టు, కీలక వ్యాఖ్యలు