Supreme Court: గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొద్ది రోజల కిత్రం ఓ మహిళ తన 26 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇప్పటికే పలు మార్లు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే గర్భం వయసు 24 వారాలు దాటాయని.. ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపలేమని స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఆధారంగా గర్భ విచ్ఛిత్తికి అంగీకరించడం లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పు వెలువరిస్తూ.. తల్లి గర్భంలో పెరుగుతున్న పసి గుండెను ఆపేందుకు కోర్టు సుముఖంగా లేదన్నారు. గర్భిణికి ఇప్పటికే 26 వారాల, 5 రోజులు పూర్తయ్యాయియని, ప్రస్తుతం తల్లికి ఎటువంటి ముప్పులేదన్నారు. ఈ కేసు గర్భస్థ శిశువు అసాధారణతకు సంబంధించి కేసు కూడా కాదని పేర్కొంది. విచ్ఛిత్తికి అనుమతిస్తే.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టులోని సెక్షన్ 3, సెక్షన్ 5 ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. మహిళ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారని.. ఆ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. శిశువు పుట్టిన తర్వాత స్వయంగా పెంచుకోవడమా లేదా దత్తత ఇచ్చే అంశంపై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.
అసలేం జరిగిందంటే..
26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలని ఓ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని, శారీరకంగా మానసికంగా మూడో ప్రసవానికి సిద్ధంగా లేనని చెప్పింది. అయితే...ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. గర్భంలోని శిశువు పూర్తి ఆరోగ్యంగా జన్మించే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాన్ని గౌరవించాలని సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ విన్నవించారు. అంతకు ముందు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం అబార్షన్‌కి అనుమతినిచ్చారు. మహిళల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
అయితే తల్లీ బిడ్డల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి.. మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేశారు. అంతే కాదు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే.. అది భ్రూణహత్య కిందకే వస్తుందని వాదించారు. ఈ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పుతో విభేదించింది. ఇప్పటికిప్పుడు అబార్షన్ ప్రక్రియను ఆపేయాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఒకవేళ మరోసారి ఇదే పిటిషన్‌తో వస్తే...గతంలో ఇందుకు ఆమోదం తెలిపిన ధర్మాసనానికే ఆ పిటిషన్‌ని బదిలీ చేస్తామని వెల్లడించింది.
అంతకు ముందు ఏం చెప్పారంటే..
వైద్య నివేదికల ప్రకారం, లాక్టేషనల్ అమెనోరియా సమయంలో, గర్భం సాధారణంగా జరగదు. కానీ పిటిషన్ వేసిన మహిళ గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడో బిడ్డను పెంచే పరిస్థితి లేదని, గర్భవిచ్ఛిత్తి అనుమతి ఇవ్వాలని కోరింది. పిటిషనర్ వాదనలను కోర్టు గుర్తించి, తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం స్త్రీకి తన శరీరంపై ఉన్న హక్కును గుర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అసమంజసమైన గర్భం ఒక బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తే ఆ పసికందును పోషించే బాధ్యతలో ఎక్కువ భాగం పిటిషనర్ మీద పడుతుందని పేర్కొంది. ఆ తర్వాత, మహిళ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి సూచించింది.