ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్లను, హోటళ్లను అధికారులు జేసీబీలతో కూల్చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జోషిమఠ్‌ వార్తల్లో నిలిచింది. ఒక్కసారిగా ఇళ్లు, హోటళ్లు నిట్టనిలువునా చీలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలకు ఆదేశించారు. 


ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ఉదయం రంగంలోకి దిగిన సిబ్బంది కూల్చివేతలు షురూ చేసింది. ఇప్పటికే ఆ నివాసాల్లో ఉంటున్న ప్రజలకను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జోషిమఠ్‌ వాసులంతా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 






జోషిమఠ్‌లో భూమి దిగబడటంతో ఒక్కసారి నివాసాలు, హోటళ్లలలో పగుళ్లు ఏర్పడ్డాయి. సుమారు ఏడు వందల ఇళ్లు ఇలా దెబ్బతిన్నాయి. దీంతో స్థానికులు కంగారు పడ్డారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ఇక్కడ నివాసం సురక్షితం కాదని ప్రజలను ఒప్పించి అక్కడి నుంచి తరలించారు. పగుళ్లు వచ్చిన ఇళ్లకు రెడ్‌ మార్క్‌ వేసి కూల్చివేస్తున్నారు. బాధిత కుటుంబాలకు నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. 


మరోవైపు జోషిమఠ్‌లో పగిలిన ఇళ్లు కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై జనవరి 16న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ముక్తేశ్వరానంద్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి నిర్ణయాన్ని తెలిపింది. 






ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి రోడ్లపై పగుళ్లు వచ్చాయి. సింగ్‌ధార్ వార్డులోని ఓ శివాలయం కుప్ప కూలింది. ఇళ్ల గోడలకూ పగుళ్లు వచ్చాయి. ఫలితంగా..స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందోనని భయపడిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా...ప్రజలు మాత్రం ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే...ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 700 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక హెలికాప్టర్లో వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


అకస్మాత్తుగా ఇక్కడి భూమి కుంగిపోవడానికి కారణాలేంటో పరిశీలించాలని కేంద్రం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమి కూడా స్పందించారు. బాధితులకు ఎలాంటి నష్టం లేకుండా పునరావాస చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.  జోషిమఠ్-మలారీ రోడ్‌ కుంగిపోవడం సంచలనమైంది. భారత్, చైనా సరిహద్దుని అనుసంధానం చేసే ఈ మార్గం వ్యూహాత్మకమైంది. అందుకే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.