Orissa High Court: పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఒడిశా హైకోర్టు తీర్పు ఇచ్చింది. సదరు మహిళ అంగీకారంతో లైంగిక సంబంధం కలిగి ఉంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేదమంది. ఇలాంటి కేసుల్లో క్రిమినల్ చట్టాన్ని నిందితులపై ఉపయోగించలేమని కోర్టు తెలిపింది.
జస్టిస్ సంజీవ్ పాణిగ్రాహి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి. వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం అత్యాచారంగా భావించలేమన్నారు. అలాంటి కేసుల్లో ఐపిసి సెక్షన్ 375 కింద కేసులు రిజిస్టర్ చేయలేరని పేర్కొన్నారు. అత్యాచారం కేసులో బెయిల్‌పై విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
షరతులతో కూడిన బెయిల్
కోర్టు ముందుకు వచ్చిన కేసులో నిందితుడిగా చెప్పిన వ్యక్తి... బాధితురాలిగా చెబుతున్న మహిళకు బాగా తెలుసన్నారు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయస్తులని పోలీసు రికార్డులు చెబుతున్నాయని కోర్టు వివరించింది. అత్యాచారం జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ కూడా నిర్దారిస్తున్నాయని జస్టిస్ పాణిగ్రాహి అన్నారు. దీంతో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు కోర్టు ఆదేశించింది. బెయిల్ కింద ఉన్న నిందితుడు దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని ఆదేశించింది. బాధితురాలిని బెదిరించరాదని కోర్టు పేర్కొంది.
కేసుల పూర్వాపరాలు
కోర్టు ముందుకు వచ్చిన ఈ కేసులో పెళ్లి నెపంతో ఓ యువకుడు ఓ మహిళతో లోబర్చుకున్నాడు. శారీరక సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి నిందితుడు పారిపోయినట్టు కేసు రిజిస్టర్ అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు బెయిల్ కోసం ముందు కింది కోర్టును ఆశ్రయించారు. అక్కడ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
కింది కోర్టులో బెయిల్ తిరస్కరణకు గురికావడంతో నిందితుడు హైకోర్టులో అప్లై చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం మహిళ ఇష్టానికి విరుద్ధంగా సంబంధం కలిగి ఉంటే అత్యాచారంగా పరిగణించవచ్చని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిశారని అందుకే దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. బెయిల్ ఇవ్వాల్సిందిగా కింది కోర్టును ఆదేశించింది. ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.