Delhi-NCR Earthquake:
ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లతో పాటు నేపాల్ లో భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నేపాల్ లో మంగళవారం మధ్యాహ్నం 2:51 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లో పలుచోట్ల దాదాపు 10 సెకన్ల పాటు భారీగా భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని అధికారులు చెబుతున్నారు.
దేశ రాజధాని నాల్గవ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. అయితే నేపాల్ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. నేపాల్ లో భారీ భూకంపం ప్రభావం భారత్ లోనూ కనిపించింది. ఢిల్లీతో పాటు యూపీ, ఉత్తరాఖండ్ లలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ ప్రజలు అందరూ సురక్షితంగా ఉన్నారా.. ఎక్కడైనా సమస్య ఉంటే 112 నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ప్రజలు బిల్డింగ్ లలో లిఫ్టులు వాడకూడదని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రావాలని, భయాందోళనకు గురికాకూడదని ప్రజలకు ఢిల్లీ అధికారులు సూచించారు.
ఇటీవల ఆగస్టు 5న ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 181 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అప్పట్లో తెలిపింది.