Tamil Nadu Heavy Rains : భారీ వర్షాలు తమిళనాడు (Tamil Nadu)ను వీడటం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద నీటి (Flood Water)లో చిక్కుకున్నాయి. దీంతో 800 మంది ప్రయాణికులు...తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం (Srivaikuntam ) రైల్వేస్టేషన్ (railway station)లో చిక్కుకుపోయారు. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ వైకుంఠంలోని రైల్వే స్టేషన్ చుట్టూ నీరు చేరింది. రైలు పట్టాలు దెబ్బతినడంతో రైళ్లు రాకపోకలు ఆగిపోయాయి. పట్టాలపై భారీగా వరద నీరు చేరడటంతో ప్రయాణికులు స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఆ స్టేషన్‌కు వెళ్లే రహదారి కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. విపత్తు నిర్వహణ ప్రతిస్పందన దళం సహాయక చర్యుల చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M.K.Stalin) సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు. ప్రస్తుతం భారీస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. వందేభారత్ సహా 17 రైళ్లు రద్దయ్యాయి.
ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం స్టాలిన్
మిగ్‌జాం తుపాను ప్రభావం నుంచి బయటపడకముందే తాజాగా మళ్లీ వర్షాలు పడటంతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో సహాయక చర్యలకు కేంద్రం నుంచి త్వరగా నిధులు మంజూరు చేయాలని సీఎం కోరనున్నారు.