Speed Breaker Saves Old Man Life In Kolhapur: ఓ స్పీడ్ బ్రేకర్ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharastra) కొల్హాపూర్‌లో (Kolhapur) జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 65 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు రాగా ఆస్పత్రికి తీసుకెళ్తే మరణించాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొస్తుండగా స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనం ఓ చోట కుదుపునకు గురి కాగా.. అతని శరీరంలో కదలికలు వచ్చి మళ్లీ బతికాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొల్హాపూర్‌నకు చెందిన పాండురంగ్ డిసెంబర్ 16వ తేదీన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబీకులు ఆయన్ను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
పాండురంగ్ మరణవార్త తెలుసుకున్న బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా అతని ఇంటికి చేరుకుని మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని అంబులెన్సులో స్వగ్రామానికి తీసుకొస్తుండగా.. మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అది గమనించని డ్రైవర్ వేగంగా వెళ్లిపోవడంతో వాహనం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో పాండురంగ్ శరీరంలో కదలిక వచ్చింది. చిన్నగా చేతులు కదపడం గమనించిన కుటుంబీకులు.. అదే అంబులెన్సులో వేరే ఆస్పత్రికి తరలించారు. ఆయన గుండెకు యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించిన వైద్యులు ప్రాణాలు కాపాడారు. 2 వారాల చికిత్స అనంతరం కోలుకున్న పాండురంగ్ సోమవారం ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, తొలుత మరణించినట్లు చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు.