Mumbai Airport: ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ స్థాయిలో వజ్రాలను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బ్యాగులో ఉన్న న్యూడిల్స్ ప్యాకె‌ట్‌లలో ఉంచి వజ్రాలను తెచ్చినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం సరకును సీజ్ చేసిన కస్టమ్ అధికారులు రూ.6.46 కోట్లుగా ఉందని తేల్చారు. ముంబయి నుంచి బ్యాంక్ వెళ్లాల్సిన ఓ భారతీయుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో అతణ్ని అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న ట్రాలీ బ్యాగులో ఉన్న నూడిల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ ఉన్నట్లుగా కస్టమ్స్ అధికారులు పీటీఐ వార్తా సంస్థతో తెలిపారు. 


మరోవైపు, కొలంబో నుంచి ముంబయి వస్తున్న మరో విదేశీ వ్యక్తివద్ద అధికారులు భారీ బంగారాన్ని కడ్డీలు, చిన్న చిన్న ముక్కల రూపంలో గుర్తించారు. వీటి బరువు 321 గ్రాముల దాకా ఉంటుందని తేల్చారు. ఈ బంగారాన్ని నిందితుడు లోదుస్తుల్ల దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. కనీసం 10 మంది భారతీయులు, బహ్రేన్, దోహా, రియాద్, మస్కట్, బ్యాంకాక్, సింగపూర్ నుంచి వచ్చిన మరికొందరు వ్యక్తుల నుంచి దాదాపు 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.4.04 కోట్లుగా ఉంటుందని తెలిపారు. 


పట్టుబడ్డ వారిని ప్రశ్నించడం ద్వారా అక్రమంగా వజ్రాలు, బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్లారు.. ఎవరికి డెలివరీ చేయబోతున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. అతని ఇతర సహచరుల గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.