AAP Vs BJP : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని మంత్రులను కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ మంత్రి అరెస్ట్ కాగా.. మరో మంత్రిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఓ ఫేక్ కేసులో తమ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సిబిఐ అభియోగాలు నమోదు చేసి..అరెస్టు చేయనుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. సిసోడియా తనకు 22 ఏళ్ల నుండి తెలుసునని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శమని అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు చేశారు. ఈ మేరకు సీబీఐ ఎప్పుడైనా విచారణ చేపట్టే అవకాశం ఉంది. దాంతో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ విభాగానికి సిసోడియా నేతృత్వం వహిస్తున్నారు. సిసోడియాకు వ్యతిరేకంగా సిబిఐకు ఓ కేసు నమోదు చేసిందని కేజ్రీవాల్ అంటున్నారు. కొద్ది రోజుల్లో ఆయనను అరెస్టు చేయబోతున్నారని తెలిసిందన్నారు.
ఇది పూర్తిగా ఓ ఫేక్ కేసు అని, ఈ కేసులో అసలు నిజం లేదని కేజ్రీవాల్ చెబుతున్నారు. సిసోడియా నిజాయితీపరుడు గనుక.. ఈ కేసు కోర్టులో నిలబడదని అన్నారు. ఆప్ నేతలు ఎలాంటి తప్పు చేయనందున భయపడాల్సిన అవసరం లేదని ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా మంత్రిని అరెస్ట్ చేయబోతున్నట్లుగా పరోక్షంగా చెప్పారు.