సనాతన ధర్మం అంశంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సనాతన ధర్మం మాత్రమే మతమని మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే అని అన్నారు. శ్రీమద్‌ భాగవత్ కథా జ్ఞాన యాగం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన యోగి ఆదిత్య నాథ్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 'సనాతన ధర్మం ఒక్కటే మతం. మిగతావన్నీ వర్గాలు, పూజావిధానాలు. సనాతన ధర్మం మానవత్వం అనే మతం దానిపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం' అని యోగి పేర్కొన్నారు. గోరఖ్‌ నాథ్‌ ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన శ్రీమద్‌ భాగవత్ కథా జ్ఞాన యాగం ముగింపు కార్యక్రమంలో యోగి ప్రసంగించారు. మహంత్‌ దిగ్విజయ్‌ నాథ్‌ 54వ వర్థంతి, సాధువు మహంత్‌ వైద్యనాథ్‌ 9వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


శ్రీమద్భాగవతం సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి విశాలమైన మైండ్‌ సెట్‌ కలిగి ఉండాలని, సంకుచిత మనస్తత్వం ఉంటే దానిని అర్థం చేసుకోలేరని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. విశాల దృక్పథం కలిగి ఉండడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భాగవత కథ అనేది నిర్దిష్టంగా కొన్ని రోజులు, గంటలకు పరిమితం చేయలేమని, ఇది అనంతమైనదని అన్నారు. భక్తులు నిరంతర తమ జీవితాల్లో దీని సారాంశాన్ని గ్రహించి అనువదించుకోవాలని యోగి సూచించారు. అనంతరం యోగి మహంత్‌ దిగ్విజయ్‌నాత్‌ గురించి తెలియజేశారు. ఆయన రాజస్థాన్‌లోని మేవార్‌కు చెందిన రాణా వంశానికి చెందిన వారని, దేశ ఆత్మగౌరవం కోసం పోరాడుతూ తన జీవితాన్ని మాతృభూమికి అంకితం చేసినట్లు చెప్పారు. అనేక మతపరమైన, రాజకీయ ఆచారాల్లో సమాజానికి కొత్తదనం చేకూర్చాలని ప్రయత్నించారు. 


'మహంత్‌ దిగ్విజయ్‌ నాథ్‌ జీ గోరక్ష పీఠంలో చేరిన తర్వాత మొదట విద్యపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర ప్రతాప్‌ ఎడ్యుకేషనల్‌ కౌన్సిల్‌ను స్థాపించారు. యువ తరాన్ని జాతీయతతో నింపడానికి తన సంస్థలను విస్తరించారు. ఆయన స్థాపించిన విద్యా మండలి అందుకు సహకరించింది. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎన్నో విద్యా శిక్షణా సంస్థలను స్థాపించారు. దేశం, సమాజానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి యువతను సిద్ధం చేయడానికి ఇవి సహకరిస్తాయి' అని యోగి పేర్కొన్నారు.


కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని డీఎంకే నేత ఉదయ నిధి స్టాలిన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మం రూపుమాపాలని వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ అంశంపై వివాదం కొనసాగుతోంది. సనాతన ధర్మం కరోనా లాంటిదని దానిని పూర్తిగా నివారించాలని వివాదాస్పదంగా మాట్లాడారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కూడా పలుమార్లు ఉదయనిధి వెల్లడించారు. ఆయన మాటలపై పలు వర్గాల నుంచి విపరీతమైన విమర్శలు వచ్చాయి. బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  ఆయన వ్యాఖ్యల పట్ల ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్‌ జిల్లాలో కేసు కూడా నమోదైంది. అయితే ఉదయనిధికి మద్దతుగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం సోషల్‌మీడియాలో వాదనలు జరగుతున్నాయి.